మందుబాబులూ పారా హుషార్.. తెలంగాణ సర్కార్ మద్యం ధరలను పెంచేసింది!

ఉన్నట్టుండి మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు చాలా తక్కువ అన్న ఫీలింగ్ ఉండేది. పోరుగు రాష్ట్రంలోని మందు బాబుల జేబులను జగన్ సర్కార్ కత్తిరిస్తోందని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు కూడా వేశారు.

అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. అన్ని బ్రాండ్లపైనా కనీసం పది శాతం వరకూ ధరలు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు ఆ ధరలు గురువారం నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఇంతకీ ధరలు ఎంత పెంచారయ్యా అంటూ మాత్రం రాజ్యసభ సభ్యుల పేర్లు చివరి నిముషం వరకూ సస్పెన్స్ లో ఉంచిన విధంగా ఆ వివరాలను గురువారం నాడే ప్రకటిస్తామని చెప్పింది.

అంతేనా బుధవారం మద్యం విక్రయాల సమయం ముగియగానే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలనూ సీజ్ చేసి.. ఆయా దుకాణాలలో ఉన్న స్టాక్ ను పెరిగిన ధరలను అనుగుణంగా విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ నుంచి అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు ఫుల్ బాటిల్ మద్యంపై తక్కువలో తక్కువ 80 రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉంది.

అలాగే వేసవిలో అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన బీర్ల వినియోగం ఇక పెరిగిన ధరలతో తగ్గుముఖం పట్టక తప్పదని మందు బాబులు అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్కో బీరు బాటిల్ పై కనీసం పాతిక రూపాయలు పెరిగే అవకాశం ఉంది.