మోడీది చిల్లర వ్యవహారం.. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.. కేసీఆర్ ఫైర్
posted on May 19, 2022 7:08AM
కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. 16 రోజుల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమై మౌన వ్రతం పాటించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అజ్ణాత వాసం నుంచి బయటకు వస్తూనే కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు.
ఇంతకీ ఆయన ఆగ్రహానికి కారణమేమిటంటే.. రాష్ట్రాలను విస్మరించి కేంద్రమే గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇవ్వడం. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాను కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు. ఆ సమీక్ష సందర్భంగా అధికారులు కేంద్రం నుంచి పంచాయతీకి రావలసిన నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే పడుతున్నాయనీ, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ తంతు జరుగుతోందనీ వివరించారు. దీంతో కేసీఆర్ ఫైరైపోయారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్రాల పరిస్థితులు కేంద్రానికి ఏం తెలుసునని నిలదీసారు. రాష్ట్రంలోని పల్లెలపై కేంద్రం పెత్తనమేమిటని మండి పడ్డారు. ఇదంతా మోడీ చిల్లర వ్యవహారమని పేర్కొన్నారు.
జవహర్ రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఇవ్వడమంటేని ప్రశ్నించారు . రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. ఆర్థికంగా దెబ్బతీసే విధానాలను కేంద్రం అనుసరిస్తున్నదన్నారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న కేసీఆర్ మళ్లీ కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడటంతో.. ఇక రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇన్ని రోజులూ కేసీఆర్ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలను టీఆర్ఎస్ మంత్రులూ నేతలూ తిప్పి కొట్టినా కేసీఆర్ గళం విప్పకపోవడంతో విమర్శలకు వచ్చినంత స్పందన, టీఆర్ఎస్ ప్రతి విమర్శలకూ, ఖండనలకూ రాలేదు.
దీంతో టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దాదాపు 18 రోజుల మౌనం తరువాత కేంద్రంపై విమర్శల నిప్పులు చెరగడంతో నడ్డా, అమిత్ షా విమర్శలకు దీటుగా మోడీపై విమర్శలతో లెవల్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.