హరీష్ రావు డ్రైవర్‌కీ తప్పలేదు...
posted on Dec 18, 2015 12:02AM

తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు నిరంతరాయంగా జరుగుతూనే వున్నాయి. తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు మొదటి నుంచీ ఎక్కువే. స్వతహాగా ఈ ప్రాంత ప్రజలు సున్నిత హృదయులు కావడం వల్ల తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి ఆత్మహత్యను మార్గంగా ఎంచుకుంటూ వుంటారు. తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా అందుకే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే తాము కోరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలు ఆగుతాయని చాలామంది భావించారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు జరగవని అనుకున్నారు. ప్రభుత్వం కూడా తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల, రైతు అనుకూల విధానం వల్ల రైతుల ఆత్మహత్యలే వుండబోవని అనుకుంది. అయితే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాపం ప్రభుత్వం కూడా రైతుల్లో మనోబలం నింపడానికి, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీవ్రంగా కృషి చేస్తోంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నం, ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదని, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రైతుల్లో నమ్మకం పెంచడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దీనికి నిదర్శనం.
తెలంగాణ ప్రభుత్వం రైతుల్లో భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని పెంచలేకపోతోంది. తమ కష్టాలను ప్రభుత్వం తీర్చగలదన్న విశ్వాసాన్ని పెంపొందించలేకపోతేందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మిగతా రైతుల విషయం అలా వుంచితే, ప్రభుత్వాన్ని నడిపే కీలక వ్యక్తుల దగ్గర పనిచేసేవారికి కూడా ప్రభుత్వం మీద నమ్మకం కలగలేదా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే, మంత్రి హరీష్ రావు దగ్గర గత సంవత్సర కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణాజీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజీ మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన రైతు. వ్యవసాయంలో నష్టం రావడం వల్ల కృష్ణాజీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంలా దొరికింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తమ దగ్గర పనిచేస్తున్న వారిలోనే నమ్మకం పెంచుకోలేకపోయారని... ఇక రాష్ట్ర వ్యాప్తంగా వున్న రైతుల్లో నమ్మకం ఎలా పెంచగలరని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు దగ్గర పనిచేసే వ్యక్తికీ ఆత్మహత్య తప్పకపోవడం బాధాకరమని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఇరుకున పడినట్టే కనిపిస్తోంది.