రోజా మేడమ్‌కి హ్యపీ ఎందుకంటే...
posted on Dec 18, 2015 12:36AM

కాల్‌మనీ వ్యవహారం మీద అసెంబ్లీలో రచ్చరచ్చ చేయాలని వైసీపీ నాయకుడు జగన్ నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే ఆయన పార్టీ సభ్యులు అసెంబ్లీలో తమ ప్రతాపం చూపిస్తూ సభా కార్యక్రమాలు సజావుగా నడవకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ధోరణికి పతాక స్థాయిగా వైసీపీ నాయకురాలు రోజా వ్యవహరిస్తున్న తీరును పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏ విషయంలో అయినా తమ నాయకుడి ఆశయాలకు అనుగుణంగా రాద్ధాంతం చేసే రోజా మేడమ్ కాల్‌మనీ వ్యవహారం విషయంలో తన ప్రతాపం చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా సంవత్సరంపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. రోజా సస్పెన్షన్ పట్ల ఆ పార్టీ నాయకుడు జగన్ బాధపడిపోతూ వుంటే, రోజా మేడమ్ మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేసినందుకు రోజా మేడమ్ హ్యాపీగా ఫీలవటాన్ని అధికార పార్టీ నాయకులు కామెడీగా తీసుకున్నారు.
అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ బయట అయినా తమ నాయకుడు జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్ కార్యక్రమాన్ని రోజా మేడమ్ చాలా విజయవంతంగా నిర్వహిస్తూ వుంటారు. స్వతహాగా నటి కావడం వల్ల రౌద్ర రసాన్ని చాలా ప్రతిభావంతంగా పోషిస్తూ వుంటారు. అయితే ఈ ధోరణి వల్ల నటిగా ఆమె పట్ల ప్రజల్లో వున్న అభిమానాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ఈ నష్టాన్ని రోజా గ్రహించినప్పటికీ అధినేత మెప్పుకోసం అల్లరి చేయాల్సిన బాధ్యతను ఇష్టంలేకపోయినా నిర్వర్తిస్తున్నారని, ఇప్పుడు సస్పెండ్ కావడం వల్ల ఇక ఆమెకు అల్లరి చేసే బాధ తప్పిందని, అందుకే ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. అంతేకాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలతోపాటు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా రోజాకు అవకాశాలు పెరిగాయని, సస్పెండ్ అయిన ఈ సంవత్సర కాలంలో టీవీలో, సినిమాల్లో ఎడాపెడా నటించేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చని ఆమె ఆనందపడిపోతోందని వెటకారంగా అంటున్నారు.