కోరికోరి చిప్పకూడు తినడమెందుకో?!



నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తల్లీకొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చిప్పకూడు తప్పేలా లేదనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో వీళ్ళిద్దరూ జాయింటుగా జైలుకు వెళ్ళే ప్రమాదం ముంచుకొస్తోంది. అయినప్పటికీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించకుండా జైలుకు వెళ్ళాలని, తద్వారా రాజకీయంగా బలపడాలని తల్లీకొడుకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం వుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమ అధినేత్రి సోనియా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీ ఈ కేసు విషయంలో మొండిగా వ్యవహరిస్తూ స్వయంగా జైలుకు వెళ్తే భవిష్యత్తులో పరిస్థితి ఎలా వుంటుందోనని కాంగ్రెస్ వర్గాలు భయపడుతున్నాయి. రాజకీయ వ్యూహం పేరుతో కోరికోరి జైలుకు వెళ్ళడం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని వారు భయపడుతున్నారు. జైలుకు వెళ్ళేంత సాహసం చేయవద్దని మేడమ్‌కి, చిన్నసార్‌కి చెప్పాలని వున్నా, అలా చెప్పే ధైర్యం లేక మిన్నకుంటున్నారు.

నిజానికి ఈ కేసు విషయంలో తల్లీ కొడుకులు లేనిపోని రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. తాము జైలు వెళ్ళడం ద్వారా బీజేపీని బద్నామ్ చేయాలని వీరు భావించడం హాస్యాస్పదంగా వుందని వారు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ ప్రస్తుతం బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. విచారణకు సోనియా, రాహుల్ హాజరు కావలసి వుంది. టైమ్ బాగాలేకపోతే వాళ్ళు అరెస్టు అయ్యే అవకాశం కూడా వుంది. ఈ సందర్భాన్ని కూడా సోనియా అండ్ సన్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం తమను సాధించడానికి ఈ కేసును ఉపయోగించుకుంటోందని అంటున్నారు. అయితే నిజానికి ఈ కేసును దాఖలు చేసిన సమయంలో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలోనే లేరు. సోనియా, రాహుల్ బెయిల్ కోసం ప్రయత్నించకుండా జైల్లో కూర్చోవడం వల్ల బీజేపీకి జరిగే నష్టమేమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించకుండా అనవసరంగా జైలుకు వెళ్ళాలని అనుకోవడం తప్పు నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం సోనియా, రాహుల్ జైలుకు వెళ్ళి చిప్పకూడు తినడానికే ఫిక్సయినట్టు అర్థమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu