బ్రేకింగ్ న్యూస్‌.. తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావుకు క‌రోనా..

తెలంగాణ డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌-డీహెచ్ శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు. స్వల్ప లక్షణాలతో ఆయ‌న‌ ఆసుపత్రిలో చేరారు. "స్వల్ప కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. పరీక్ష ద్వారా కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా" అని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస‌రావుకే క‌రోనా సోక‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌రోనాపై వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ మొత్తం చూసుకునేది ఆయ‌నే. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్స్‌తో క‌రోనా హెచ్చ‌రిక‌లు చేసేది ఆయ‌నే. క‌రోనా జాగ్ర‌త్త‌లు సూచించేది ఆయ‌నే. ఆసుప‌త్రుల్లో ఏర్పాట్లు, చికిత్సా స‌న్న‌ద్ద‌త చూసుకునేది ఆయ‌నే. ఇలా కొవిడ్ టైమ్‌లో సీఎం కేసీఆర్ స్థాయిలో పాపులారిటీ సంపాదించిన డీహెచ్ శ్రీనివాస‌రావుకే ఇప్పుడు క‌రోనా సోక‌డం కంగారెత్తించే న్యూసే. 

ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ నీతులు చెప్పే మీరు.. ఆ జాగ్ర‌త్త‌లేవో మీరు పాటిస్తే బాగుండుగా సారూ.. ఇప్పుడిలా కొవిడ్ బారిన ప‌డేవారు కాదుగా.. అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. ఇంకొంద‌రు మాత్రం హెల్త్ డైరెక్ట‌ర్‌కే వైర‌స్ సోకిందంటే.. మ‌న‌లాంటి సామాన్యులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రాన్ని సూచిస్తోంద‌ని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస‌రావుకు కొవిడ్ పాజిటివ్ రావ‌డం బ్రేకింగ్ క‌మ్ షాకింగ్ న్యూసే అంటున్నారు.