ఒక్కరోజే 65మంది పోలీసులకు క‌రోనా.. డిపార్ట్‌మెంట్ షేక్‌..

థ‌ర్డ్ వేవ్ ఎప్పుడు? ఎప్పుడైతే పోలీసులు పెద్ద సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డుతారో అదే థ‌ర్డ్ వేవ్‌.. ఓ టీవీ డిబేట్‌లో ఎక్స్‌ప‌ర్ట్ చెప్పిన మాట‌లివి. ఆయ‌న అన్న‌ట్టే జ‌రుగుతోంది. పోలీసులకు పెద్ద సంఖ్య‌లో క‌రోనా సోకుతోంది. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసింద‌నే సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. 
 
తెలంగాణ‌లో కరోనా బారిన పడుతున్న వారిలో పోలీసులూ పెద్ద సంఖ్య‌లో ఉంటున్నారు. హైద‌రాబాద్‌ వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్‌ స్టేషన్లలో మొత్తంగా 65 మందికి పైగా కొవిడ్‌ బారినపడ్డారు. హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇటీవల సైబర్ క్రైమ్ బృందం ఓ కేసు విచార‌ణ‌కు రాజస్థాన్‌ వెళ్లి వచ్చింది. ఆ బృందంలో ఒక ఎస్సైకి కరోనా అటాక్ అయింది. అతని నుంచి మిగతా సిబ్బందికి వైర‌స్ వ్యాపించిన‌ట్టు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన ఆ 20 మంది పోలీసులు హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. 

వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. ఇక ఇప్ప‌టికే యాదగిరిగుట్ట పీఎస్‌లో ఏసీపీ, సీఐ సహా 12 మంది కొవిడ్ సోకింది. లేటెస్ట్‌గా నార్సింగి పీఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో 15 మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయింది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ, మరో 14 మంది కానిస్టేబుళ్లు వైరస్‌ బారినపడ్డారు. చైతన్యపురి పీఎస్‌లో 8 మంది కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్‌ బారినపడటంతో స్టేషన్ ద‌గ్గ‌ర‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.