ఏపీలో 7000 కేసులు.. సంక్రాంతి ఎఫెక్ట్‌.. క‌రోనా క‌ల‌క‌లం..

ఊహించిన‌ట్టే జ‌రుగుతోంది. ఏపీని క‌రోనా కమ్మేస్తోంది. సంక్రాంతి మూడు రోజులు పండుగ జోరుగా, హుషారుగా చేసుకోవ‌డంతో.. ఆ ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు క‌నిపిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా కొవిడ్ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 7వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 6,996 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. గ‌త మూడు నాలుగు రోజులుగా రోజుకు సుమారు నాలుగున్న‌ర వేల కేసులు వ‌స్తుండ‌గా.. తాజాగా, ఈ సంఖ్య ఏకంగా 5 వేల‌కు పెర‌గ‌డం ఆందోళ‌క‌ర‌మైన ప‌రిణామం. అంటే, దాదాపు రెండున్న‌ర వేల కేసులు అద‌నంగా రావ‌డంతో అంతా ఉలిక్కిప‌డుతున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 1,534 కేసులు నమోదయ్యాయి.  

కొవిడ్‌తో న‌లుగురు చ‌నిపోవ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 36,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఓవైపు కొవిడ్ కిట్ల కొర‌త‌తో ఏపీలో టెస్టుల సంఖ్య త‌గ్గించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయినా, రోజూవారీ కేసులు భారీగా పెర‌గ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే సంక్రాంతికి సొంతూళ్ల‌కు వ‌చ్చిన వారంతా వారి వారి ప్రాంతాల‌కు తిరిగి వెళ్లిపోయారు. ఒక‌వేళ వారికి కొవిడ్ సోకి ఉంటే.. వారి ద్వారా ఆయా ప్రాంతాల్లోనూ వైర‌స్ వ్యాప్తి చెందే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, ఎందుకైనా మంచిది.. పండ‌గ‌కి ఊరెళ్లి వ‌చ్చిన వారంతా రెండు మూడు రోజులు హోం ఐసోలేష‌న్‌లో ఉంటే మంచిద‌ని సూచిస్తున్నారు.