ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: తెలంగాణ కాంగ్రెస్
posted on Mar 11, 2019 5:47PM

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో ఆ పార్టీ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని గుర్తుచేశారు. అయినా పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని ఆశించామని ఉత్తమ్ అన్నారు.
అదేవిధంగా లోక్ సభ ఎన్నికల గురించి కూడా ఉత్తమ్ మాట్లాడారు. జరగబోయే ఎన్నికలు భారత ప్రధాని ఎవరు కావాలని తేల్చే ఎన్నికని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని.. మైనారిటీల్లో, దళితుల్లో అభద్రతా భావం కల్పించిన నరేంద్రమోదీయా? దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీయా? ఎవరు ప్రధాని కావాలన్నది ఈ పార్లమెంట్ ఎన్నికలు నిర్ణయిస్తాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అబద్దపు ప్రచారం చేస్తోందని, 16 సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసిస్తామని చెబుతోందని మండిపడ్డారు. 2014లో టీఆర్ఎస్ 12 ఎంపీ స్థానాలు గెలుచుకుందని.. ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పార్టీలో చేర్చుకుని.. మొత్తం 15 మంది అయ్యారని, ఎంఐఎం మిత్రపక్షంగా ఉందని, అయినా ఢిల్లీలో ఏమీ సాధించలేదని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేసీఆరే అంటున్నారని.. దీనిబట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగదని ఉత్తమ్ విమర్శించారు.