ఎన్టీఆర్, హరికృష్ణ మృతదేహాలతో చంద్రబాబు రాజకీయాలు
posted on Mar 11, 2019 6:16PM

కాకినాడలో నిర్వహించిన వైసీపీ సమరశంఖారావం సభలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు అనుభవించారని అన్నారు. అధికారపార్టీ టీడీపీ.. వైసీపీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ చేసే అరాచకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. డేటా దొంగతనం చేస్తూ చంద్రబాబు దొరికిపోయారని జగన్ విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన 650 హామీలు నెరవేర్చలేదన్నారు. సిగ్గులేకుండా చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు వారం ముందు చంద్రబాబు తన బినామీలకు భూముల కేటాయింపు, రాయితీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అన్నింటా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఏపీలో రాక్షసపాలన సాగుతోందన్నారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు పాలన.. జన్మభూమి కమిటీలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.లక్షా 20వేలు బాకీ పడ్డారని జగన్ అన్నారు. రాజధానిలో 3సెం.మీల వర్షం పడితే తాత్కాలిక భవనాల్లో 6సెం.మీల వర్షం లీకవుతుందని ఎద్దేవా చేసారు. పోలవరం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు కదలడం లేదని విమర్శించారు.
ఎన్టీఆర్, హరికృష్ణ మృతదేహాల దగ్గర చంద్రబాబు రాజకీయాలు చేశారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు అవసరమా అనే విషయంపై చర్చ జరగాలన్నారు. ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని జగన్ చెప్పారు. రాష్ట్రంలో రాత్రి పదైతే మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉన్న ఓట్లు తొలగించి.. లేని ఓట్లను చేర్పిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఓట్ల తొలగింపులో చంద్రబాబు క్రిమినల్ నెంబర్ వన్ అని విమర్శించారు. ప్రపంచంలోనే అవినీతిలో చంద్రబాబు నెంబర్ వన్ అన్నారు. రాబోయే రోజుల్లో లగడపాటి రాజగోపాల్‌తో దొంగ సర్వేలు చేయించి ప్రకటిస్తారని.. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైందో అందరూ చూశారంటూ జగన్ ఎద్దేవా చేసారు.