జగన్ రూట్ లోనే తెలంగాణ కాంగ్రెస్..
posted on Mar 14, 2016 6:07PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 8మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు జగనే స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ పంథాలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ అధికార పార్టీలోకి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుండి.. టీడీపీ నుండి పలువురు వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినా.. స్పీకర్ సరిగ్గా స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తోంది.