నామినేటెడ్ పదవులపై కేసీఆర్ క్లారిటీ

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడింది. గతంలో క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసినా...అవి జిల్లా పరిధిలోనే ఆగిపోయాయి. దీంతో రాష్ట్రస్థాయి కమిటీ, పొలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. దసరా పండగలోపు ఈ కమిటీలు వేసేలా కసరత్తు చేయాలని పార్టీ నేతలకు, మంత్రులకు కేసీఆర్ సూచించారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా రాష్ట్రస్థాయి కమిటీని, చిన్న స్థాయి పొలిట్ బ్యూరోను, 42 మంది సభ్యులకు మించకుండా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు.

పార్టీ కమిటీలతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా ఈ దసరా పండగకు అటూఇటుగా భర్తీ చేయనున్నట్లు సీఎం స్పష్టంచేశారు. మార్కెట్, దేవాలయ, పౌర సరఫరాలు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ, గ్రంథాలయ కమిటీలకు సంబంధించిన నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు, ఇందుకోసం ఆయా శాఖల మంత్రులను సంప్రదించి నియామకాలు చేపడతామని, పార్టీ కోసం పనిచేసిన నేతలతో పాటు కొత్తగా చేరిన వారిలో కూడా అర్హతను బట్టి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు.

ఇక ప్రజా ప్రతినిధులంతా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై దృష్టి సారించాలన్నారు. మిషన్ కాకతీయ కింద ఏటా 20 శాతం చెరువులే లిమిట్ కాదని 50 శాతం వరకైనా టేకప్ చేయాలన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి సహకరించాలన్నారు. ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగమని చెప్పిన వాటర్ గ్రిడ్ పనుల బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న కేసీఆర్... ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు వెంటపడి పనులు చేయించుకోవాలన్నారు.

ప్రతిపక్షాలకు సంబంధించి కూడా గులాబీ నేతలకు కేసీఆర్ సూచనలు ఇచ్చారు. విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే పట్టించుకోవాల్సిన పనిలేదని....అభివృద్ధి పనులకు మాత్రమే సమయం కేటాయించాలన్నారు. దసరా తర్వాతే జిల్లాల్లో పర్యటిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్... వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu