బీహార్ కి అడగకుండానే మోడీ వరాలు...మరి ఏపీకి?

 

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్ లోని నవడా సమీపంలో ముంగేర్ వద్ద ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి తను ఏకంగా 1.65లక్షల కోట్లు మంజూరు చేస్తుంటే దానిపై కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అది చూస్తే వారిరువురికీ బీహార్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరిక లేనట్లుందని మోడీ అన్నారు. తమ కూటమికి ఓటేసి గెలిపిస్తే బీహార్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.

 

దేశంలో చాలా వెనుకబడిన బీహార్ అభివృద్ధికి ఆయన ఆ విధంగా చొరవ తీసుకోవడం అందుకోసం ఏకంగా రూ. 1.65లక్షల కోట్లు మంజూరు చేయడం అందరూ తప్పకుండా హర్షించాల్సిందే. కానీ రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అదేవిధంగా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించలేదు. బీహార్ ప్రజలు అడగక ముందే వరాలు కురిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు జరుగుతున్నా స్పందించడం లేదు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భారీగా నిధులు మంజూరు చేస్తామని ఒకప్పుడు మోడీయే స్వయంగా చెప్పారు. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చాలా సమస్యలు, అవరోధాలు ఉండి ఉండవచ్చును. కానీ బీహార్ కి ఇస్తున్నట్లే ఆంద్రప్రదేశ్ కి కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు కనుక ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ప్రకటించి తన మాట నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుకొంటున్నారు. అక్టోబర్ 22న రాజధాని అమరావతి శంఖుస్థాపనకు వస్తున్నారు. కనుక అప్పుడయినా రాష్ట్రానికి నిర్దిష్టమయిన ఆర్ధిక ప్యాకేజీపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu