అవును... నిజమే... వ్యతిరేకత వచ్చింది
posted on Oct 7, 2015 5:08PM
.jpg)
అన్నదాతల ఆత్మహత్యలు, రైతు సమస్యలపై ఊహించినట్లే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టడం, అధికార పార్టీ కూడా ముందస్తు వ్యూహం మేరకు విపక్షాలపై సస్పెన్షన్ వేటేయడం చకాచకా జరిగిపోయాయి, అయితే ఈ పరిణామాలన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో వ్యూహరచన చేస్తే... ప్రతిపక్షాల ఆందోళనతో అది పక్కదారి పట్టిందని, దాంతో ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు.
త్వరలో వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు ఉన్నందున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని, లేదంటే ప్రతిపక్షాల దుష్ప్రచారంతో మరింత నష్టపోతామని అధికార పార్టీ భావిస్తోంది, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్... జిల్లాల్లో పర్యటిస్తారని ప్రకటించిన మంత్రి హరీష్ రావు... ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం వివరిస్తారని తెలిపారు, అయినా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినా... తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమంటూ హరీష్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
అయితే వారం రోజుల్లోనే వరంగల్, నారాయణఖేడ్ బైపోల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు, ఉపఎన్నికలే టార్గెట్ గా జరిగే సీఎం టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.