గులాబీ గూటిలో పదవుల పండగ

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది, దసరా పండుగ కానుకగా పదవుల పంపకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు, పనిలో పనిగా పార్టీ కమిటీలను కూడా వేసేయాలని భావిస్తున్నారు, దాంతో గులాబీ నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు లాబీయింగ్ మొదలెట్టేశారు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు.

రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ కంప్లీటైన మార్కెట్ కమిటీలకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా, దేవాలయ కమిటీల్లో నామినేటెడ్ పోస్టులకు కూడా త్వరలో క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారు, అదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు జరిగే ఆస్కారమే లేదని తేల్చిపారేశారు. కేబినెట్ లో మార్పులుచేర్పులు ఉంటాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్న హరీష్... ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ప్రకటన చేశారు.

కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, తలసాని వ్యవహారం తలనొప్పిగా మారడంతో కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది, అలాగే వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా తొలగించి, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఓ ఇద్దరికి కొత్తగా చోటు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది, అయితే అదంతా ఒట్టిదేనని హరీష్ తేల్చిచెప్పేయడంతో ఆశావహులు నీరుగారిపోయారు.

అయితే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో కిందిస్థాయి నేతలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు, మరి విజయదశమికి ఎవరిని పదవి వరిస్తుందో, ఎవరిని నిరుత్సాహపరుస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu