తెలంగాణ రాజధానిగా వరంగల్? హైదరాబాద్ యూటీ కాబోతోందా..?
posted on Aug 4, 2021 5:20PM
హైదరాబాద్.. తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గత సంవత్సరం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా హైదరాబాద్ కు సంబంధించి కీలక అంశం తెరపైకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు మల్లన్న. వరంగల్ లో జరిగిన సభలో ఆయన డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ విస్తరించడం వల్ల జనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని.. అందుకే వరంగల్ ను రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు బీజేపీ నేతలు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని చెబుతుండటం.. ఇటు తెలంగాణకు వరంగల్ రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం చర్చగా మారాయి. రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు మల్లన్న. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు తీన్మార్ మల్లన్నకు బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ ను తెలంగాణ రాజధానిగా చేయాలని ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లన్న పబ్లిసిటీ కోసమే ఇలా అన్నారా లేక హైదరాబాద్ పై ఆయనకు ఇతరత్రా ఏమైనా సమచారం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీనిపై గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తించనుంది. ఇటీవల కోవిడ్ రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో హైదరాబాద్ కు మాకు హక్కులున్నాయని కొందరు ఏపీ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఏపీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశానికి రెండో రాజధానిగా చేసే యోచనలో ఉందంటున్నారు. హైదరాబాద్ ను యూటీగా చేస్తే తెలంగాణ నేతల నుంచి వ్యతిరేకత వస్తుంది కాని..దేశానికి రెండో రాజధానిగా చేస్తే అలాంటి సమస్య ఉండబోదని కేంద్రం పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయితే తమకు సంతోషమేనని చెప్పారు. అందుకే ఈ దిశగా కేంద్ర సర్కార్ సీరియస్ గానే కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. అలా చేస్తే తెలంగాణ, ఏపీలోనూ తమకు లాభిస్తుందనే అంచనాలో కమలం నేతలు ఉన్నారని అంటున్నారు.
మొత్తానికి బీజేపీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం ఉన్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ ను రాజధాని చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మల్లన్న ప్రకటన ఆషామాషీగా వచ్చిందేమి కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరీ.. ముందు ముందు ఏం జరగనుందో...