కేసీఆర్ డిన్నర్ పాలిటిక్స్.. దావత్‌ల వెనుక రీజన్ అదేనా?
posted on Aug 4, 2021 4:42PM
మటన్.. తలకాయ కూర.. బొటీ.. నాటుకోడి కర్రీ.. చికెన్ ఫ్రై.. చేపల కర్రీ.. ఫిష్ రోస్ట్.. పప్పు.. సాంబార్.. పెరుగు.. గారెలు.. స్వీటు. టేబుల్‌పై అన్ని రకాల వెరైటీస్. ఘుమఘుమలాడుతున్నాయి. నోరూరిస్తున్నాయి. తన వయసును, ఆరోగ్య సమస్యలను అన్నిటినీ పక్కన పెట్టేశారు. ఏ ఒక్క వెరైటీ వదలకుండా అన్నిటినీ టేస్ట్ చూశారు. తృప్తిగా, కడుపు నిండుగా విందు ఆరగించారు. ఇదీ కేసీఆర్ భోజనం. తాజాగా నాగార్జునసాగర్ పర్యటనలో ఎమ్మెల్యే భగత్ ఇంట్లో సీఎం కేసీఆర్ స్వీకరించిన ఆతిథ్యం.
కేసీఆర్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంతా కలిసి టేబుల్‌పై భోజనం చేశారు. ఎమ్మెల్యే భగత్ స్వయంగా వడ్డిస్తుంటే.. తమతో కలిసి కూర్చొని తినాలని పట్టుబట్టారట కేసీఆర్. భగత్ సతీమణి భవానీ సీఎం కేసీఆర్‌కు దగ్గరుండి వంటలన్నీ కొసరికొసరి వడ్డించగా.. ఆయన వద్దనకుండా, అస్సలు మొహమాట పడకుండా అన్నిటినీ లాగించేశారట. ఐటమ్స్ అన్నింటిని రుచి చూసిన ఆయన.. వంటలు బాగున్నాయని ప్రశంసించారు కూడా. సీఎం కేసీఆర్ కాంప్లిమెంట్స్‌తో ఎమ్మెల్యే భగత్ కుటుంబం ఫుల్ ఖుషీ.
.jpg)
సరిగ్గా.. ఇలాంటి స్ట్రాటజీనే కేసీఆర్ పదే పదే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్రగతి భవన్‌కు ఎవరొచ్చినా.. కేసీఆర్ ఏ ఊరికి వెళ్లినా.. భోజనంతో కట్టిపడేస్తారు. స్వతహాగా భోజనప్రియుడైన కేసీఆర్.. మిగతా వారినీ తన భోజనంతో, ఆతిథ్యంతో ఆకట్టుకుంటారు.

కేసీఆర్ చేసేవన్నీ డిన్నర్ పాలిటిక్సే అంటారు. ఎంతటి కీలకమైన రాజకీయ సమావేశమైనా.. భోజనం బ్రేక్ ఉండాల్సిందే. ఎంత పెద్ద ప్రముఖులైనా.. ఎంత చిన్న కార్మికులైనా.. వారితో కలిసి భోజనం చేయాల్సిందే.

ప్రగతిభవన్‌లో మీటింగ్ అంటే అధికారులకు సంబరమేనట. సీఎం రమ్మన్నారంటే పలువురు ప్రముఖులు, వివిధ వర్గాల నాయకులు ఎగిరిగంతేస్తారట. చెవుల్లో అమృతం పోసే మాటలతో పాటు, జోకులు, సెటైర్లతో, అద్భుతమైన ప్రసంగాలతో.. వచ్చిన వారెవ్వరికీ విసుగెత్తకుండా గంటల తరబడి కేసీఆర్ ఒక్కరే మాట్లాడుతుంటారు. ఏ సమీక్ష అయినా, ఏ మీటింగ్ అయినా.. దాదాపు రోజంతా ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ తప్పనిసరి. ఆ గంటసేపు మరింత మజా మజా. కేసీఆర్ పెట్టే లంచ్.. ఓ రేంజ్‌లో ఉంటుందట. తిన్న వాళ్లు రెండు మూడు రోజులు ఆ రుచి మరిచిపోరట. అంత బాగుంటుందట కేసీఆర్ ఆతిథ్యం.
అలాంటి ఆతిథ్యాన్నే తన పర్యటనల్లోనూ పాటిస్తారట. మీ ఊరికి వస్తా.. గ్రామ సమస్యలన్నీ తీరుస్తా.. మంచిగా మాట్లాడుకుందా.. అక్కడే కలిసి తిందాం.. దావత్ చేసుకుందాం.. ఇలా సాగుతుంది కేసీఆర్ దత్తత గ్రామాల పర్యటన. అది వాసాలమర్రి అయినా, చిన్నముల్కనూర్, మూడుచింతలపల్లి అయినా.. కేసీఆర్ వచ్చిండ్రంటే.. దావత్ ఉండాల్సిందే. ఎండ తగలకుండా మంచి షామియానాలు వేసి.. టేబుళ్లు పరిచి, కుర్చీలు వేసి.. వందలాది మందికి వేడివేడిగా భోజనం వడ్డిస్తారు. వారితో పాటే కలిసి కూర్చొని కేసీఆర్ సైతం అక్కడే భోంచేస్తారు. కడుపునిండా తృప్తిగా భోజనంతో పాటు.. తాము కేసీఆర్‌తో కలిసి తిన్నామనే జ్ఞాపకం సైతం వారికి కలకాలం ఉండిపోతుంది. ఇక అన్నంపెట్టినవాడిని, తమతో కలిసి తిన్నవాడిని.. జనాలు అంత ఈజీగా ఎలా మర్చిపోగలుగుతారు.

ఇక కేసీఆర్ ఎప్పుడు వరంగల్ పర్యటనకు వచ్చినా.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే విడిది చేస్తారు. అక్కడే భోజనం చేస్తారు. ఉద్యమకాలం నుంచి ఇదే అలవాటు, సెంటిమెంటు కూడా. ఆ ఇంటి భోజనం అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టమట. ఆ రుచి మరిచిపోలేకే.. ఎప్పుడొచ్చినా అక్కడే దిగుతారని అంటారు. ఇప్పటి వరకూ కేసీఆర్ వరంగల్‌కు ఓ వందసార్లు వచ్చారని అనుకుంటే.. అందులో 99సార్లు కెప్టెన్ ఇంట్లోనే బస. కానీ, ఆశ్చర్యంగా ఇటీవల మాత్రం కడియం శ్రీహరి ఇంట్లో విందు ఆరగించారు ముఖ్యమంత్రి. బహుషా, ఎమ్మెల్సీలేక, సరైన గుర్తింపులేక అసంతృప్తితో ఉన్న కడియం.. కారు దిగి పారిపోకుండా ఉండేందుకు కాబోలు.. అలా ఆయన ఇంట్లో విందు రాజకీయం నెరపారని అంటారు. ఇలా, భోజనాన్ని జిహ్వ చాపల్యానికి, రాజకీయానికీ వాడుకునే సమర్థుడు కేసీఆర్.

67 ఏళ్లు వచ్చినా.. అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నా.. భోజనం విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారట కేసీఆర్. ఇష్టంగా తింటారని.. రుచిగా ఉంటే అడిగి మరీ వడ్డించుకోవడానికి ఏమాత్రం మొహమాటపడరని అంటారు. పసందైన విందులో.. దావాత్‌లలో.. డిన్నర్ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు.