టీ-కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయిట!
posted on Aug 13, 2015 11:41AM
.jpg)
తలుపులు నమిలేసేవాడికి అప్పడాలు ఒక లెక్కా అన్నట్లు ఏపీ రాష్ర్ట ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేయగలిగినవారికి తమ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఒక లెక్కా? తెలంగాణా కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం తమ పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. ఆయన చెప్పిన మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ఓటుకి నోటు కేసు బయటపడటానికి చాలా కాలం ముందు నుండే తమ ఫోన్లు ట్యాపింగ్ చేయబడుతున్నాయని చెప్పారు. తన ఆరోపణలను ఖండించే దైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉందా? అని ప్రశ్నించారు. ఇలాగ విచ్చలవిడిగా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా నేరమని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తక్షణమే పదవి నుండి బర్త్ రఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్ కి విజ్ఞప్తి కూడా చేసారు.
అయితే ఆయన తమ ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయని పిర్యాదు చేయడం చూస్తుంటే రోలోచ్చి మద్దెలతో మొరపెట్టుకొన్నట్లుంది. విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు కాల్-డాటా తనకు సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినప్పుడు, ఆ రికార్డులు దానికి ఇవ్వకూడదని హైకోర్టులో వాదించిన తెలంగాణా అడ్వకేట్ జనరల్ రామకృష్ణ రెడ్డి తమ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. తద్వారా తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని అంగీకరించినట్లయింది. హైకోర్టులోనే ఆయన అంత విస్పష్టంగా చెపుతున్నప్పటికీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఆటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఘోడును ఎవరు పట్టించుకొంటారు? ఆయన ఆరోపణలను ఎవరు పట్టించుకొంటారు?
అయినా చాలా కాలం క్రితమే తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని తెలిసి ఉన్నప్పుడు అప్పుడే ఆసంగతి ఆయన ఎందుకు బయటపెట్టలేదు? అని తెరాస నేతలు ప్రశ్నిస్తే దానికి ఆయన జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని తెలిసి ఉంటే ఆయన కనీసం తన పార్టీ నేతలయినా హెచ్చరించి ఉండాలి. కానీ అదీ చేయలేదు. కానీ ఇప్పుడు తాపీగా ఆరోపణలు చేయడం చూస్తే, ఎందుకు చేస్తున్నారో? అని ఆయన పైనే అందరికీ అనుమానం కలుగడం సహజం. ఒకవేళ ఆయన తెలంగాణా ప్రభుత్వం తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందని నమ్ముతున్నట్లయితే, దానికి బలమయిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నట్లయితే ఆయన కూడా న్యాయపోరాటం చేయవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా మీడియా ముందుకు వచ్చి తన ఘోడు వెళ్లబోసుకొంటే ఏమి ప్రయోజనం ఉండదు.