జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు అందుకే: కామినేని

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెదేపా ఇంకా బీజేపీతో ఎందుకు స్నేహంగా ఉంటోందని, తక్షణమే తమ ఇద్దరు కేంద్రమంత్రులను రాజీనామా చేయించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరచూ డిమాండ్ చేస్తుంటారు. మొన్న డిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆయన మళ్ళీ అదే డిమాండ్ లేవనెత్తారు.

 

దానిపై స్పందించిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా-బీజేపీలు ఎప్పుడు విడిపోతాయా అని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అవి విడిపోవాలని అతను కోరుకొంటున్నాడు. కానీ ఆయన కోరిక ఎన్నటికీ తీరేది కాదని గ్రహిస్తే మంచిది. మా రెండు పార్టీల మధ్య మంచి అవగాహన, బలమయిన అనుబందం ఉంది. కాంగ్రెస్ లేదా వైకాపా నేతలు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు కేంద్రంతో దురుసుగా వ్యవహరిస్తారనుకొంటే అంతకంటే పొరపాటు ఉండదు. ఈ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలను పట్టుకొని నేను స్పందించనవసరం లేదు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం చాలా అవసరముంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే. కానీ అది ఇచ్చేందుకు కొన్ని సమస్యలున్నాయి. అందుకు తీసిపోని విధంగా ప్యాకేజి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకొని రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించాలి కానీ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని ఈవిధంగా రాజకీయాలు చేయడం వలన రాష్ట్రానికి ఇంకా నష్టమే తప్ప లాభం ఉండబోదని గ్రహించాలి. అయినా రాష్ట్రానికి చెందిన తెదేపా, బీజేపీ నేతలు డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నిటినీ సాధించుకొంటూనే ఉన్నాము. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయం మీద ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాయో ప్రజలకీ తెలుసు. వాళ్ళే వాటికి తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu