బీహార్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఐడియా
posted on Aug 13, 2015 9:20PM
.jpg)
నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలకి మూడు నెలల క్రితం నుండే అన్ని రాజకీయపార్టీలు కసరత్తు ప్రారంభించేసాయంటే అందులో విజయం సాధించదానికి ఎంత చెమటోడ్చాలో అర్ధం అవుతుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదివరకు ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ఆయన బీజేపీతో కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ తో యుద్ధం చేసేవారు. కానీ బీజేపీ మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో, ఏనాటికయినా ప్రధానమంత్రి అవ్వాలని కలలుగన్న నితీష్ కుమార్, ఇంకా ఎన్డీయేలో కొనసాగడం వలన తన కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని ఎన్డీయే కూటమిలో నుండి బయటకు వచ్చేసారు.
అప్పటి నుండి మళ్ళీ ఆయన క్రమంగా లాలూకి దగ్గరవుతూ చివరికి ఇప్పుడు బావబావ అనుకోనేంత చుట్టరికాలు కలుపుకొన్నారు. మోడీని డ్డీ కొనాలంటే తామిద్దరం చేతులు కలపాలని అర్ధం చేసుకొని మరో నాలుగు ఇతర పార్టీలను కూడా కలిపి ‘జనతా పరివార్’ ఏర్పాటు చేసుకొన్నారు. కానీ ఎక్కడయినా బావ కాని పేకాట దగ్గర కాదన్నట్లు అంత చుట్టరికాలు కలుపుకొన్నా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తామే ఉండాలని ఇద్దరూ పోటీ పడ్డారు. చివరికి వారిద్దరికీ ఎలాగో సర్దిచెప్పిన తరువాత సీట్ల పంపకాలలో మళ్ళీ గొడవ మొదలయింది. బీహార్ శాసనసభలో ఉన్న మొత్తం 243 సీట్లలో చెరో వంద పంచుకొనేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. తమకు తోక పార్టీలాగా తయారయిన కాంగ్రెస్ పార్టీకి వారు దయదలచి ఓ 40 సీట్లు విదిలించారు. మిగిలిన మూడు సీట్లని కాంగ్రెస్ పార్టీకి తోక వంటి యన్.సీ.పి.కి వదిలేశారు.
ఇంతవరకు ఎదోలాగ సర్దుకుపోయినా, మున్ముందు కూడా ఇలాగే సర్దుకుపోతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మళ్ళీ కలిసినప్పుడు గట్టిగా వాటేసుకోవడం మానలేదు. వారి ఇదే బలహీనతను, అపనమ్మకాన్ని ఆధారంగా చేసుకొని బీహార్ ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలు సిద్దం చేసుకొంటోంది. తన ఎన్నికల ప్రచారంలో వారిద్దరూ ఒకరిపై మరొకరు చేసుకొన్న ఘాటయిన విమర్శల రికార్డులను వినిపిస్తూ అధికార దాహంతో చేతులు కలిపినా అటువంటి నేతల్లో బీహార్ రాష్ట్రాన్ని పెట్టవద్దని బీజేపీ ప్రచారం చేసేందుకు సన్నాహాలు మొదలుపెటింది. మోడీ మాటల మాయాజాలం, అమిత్ షా ఈ సరికొత్త ఎన్నికల వ్యూహాలు బీహార్ ప్రజలను బీజేపీ వైపు ఆకర్షిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.