కరుణానిధి కొంప ముంచిన విజయ్‌కాంత్‌

తమిళనాట ఈసారి వృద్ధ పెన్నిధి కరుణానిధికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అందరూ ఆశించారు. పార్టీను మార్చి మార్చి ఎంచుకునే తమిళ తంబిలు ఈసారి తనకే పట్టం కడతారని పాపం కరుణ కూడా ఎదురుచూశారు. కానీ సినిమాల్లో హీరో పాత్రను పోషించే విజయ్‌కాంతే తమ పాలిట విలన్‌గా మారతాడని ఆయన ఊహించనేలేదు. ఇప్పటివరకూ అందిన ఫలితాలను గమనిస్తే విజయ్‌కాంత్‌ పార్టీ అయిన డీఎండీకే కానీ దానికి అనుబంధంగా పోటీ చేస్తున్న ఇతర చిన్నాచితకా పార్టీలు కానీ అసలు ఖాతానే తెరిచే పరిస్థితుల్లో లేవు. దీనంతటికి విజయ్‌కాంత్ అతి విశ్వాసమే కారణం అంటున్నారు విశ్లేషకులు. 2005లో డీఎండీకే పార్టీని ప్రారంభించిన విజయ్‌కాంత్‌ తొలుత చాలా ఓపికగానే తగిన అవకాశాల కోసం ఎదురుచూశారు. 2006 అసెంబ్లీ ఎన్నికలలో ఖాతా తెరిచి ప్రజల తరఫున మాట్లాడటం మొదలుపెట్టారు. విజయ్‌కాంత్‌ మీద నమ్మకం ఉంచిన జనం 2011లో జయలలితతో కలిసి పోటీ చేసినప్పుడు 41 సీట్లకు గాను 29 సీట్లలో ఆయన పార్టీని గెలిపించి శుభసంకేతాలు పంపించారు. 

 

అయితే ఆ విజయంతో విజయ్‌కాంత్‌ తీరు మారిపోయింది. కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే మీదే కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు. దాంతో జయ తనదైన శైలిలో డీఎండీకే ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే వైపు లాక్కునిపోయారు. అది మొదలు జయ మీద కసితో రగిలిపోయారు విజయ్‌కాంత్‌. అలాగని డీఎంకేతోనో, బీజేపీతోనో పొత్తు పెట్టుకున్నారా అంటే అదీ లేదు. తమిళ ప్రజలకు మరో ప్రత్యామ్నాయం చూపుతానంటూ చిన్నాచితకా పార్టీలను చేరదీసి కొత్త కుంపటి పెట్టారు. విజయ్‌కాంత్ చేసిన ఈ పని వల్ల వచ్చిన ఫలితం ఏమిటయ్యా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిట్టనిలువునా చీలిపోయింది. ఇక యోగాసనాలు వేయడం దగ్గర్నుంచీ విలేకరుల సమావేశాల దాకా విజయ్‌కాంత్‌ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కోపంతో తూలిపోతూ, మైకంలో ఊగిపోతూ ఆయన చేసిన సందడిని యూట్యూబుల్లో చూసి మరీ నవ్వుకున్నారు జనం. ఆయన వింత చేష్టలకు భార్య ప్రేమలత ఎన్ని వివరణలు ఇచ్చినా అవి అంతగా పొసగలేదు. చివరికి గద్దె పరుచుకోవల్సిన డీఎండీకే గొయ్యి తవ్వుకుని కూర్చుంది. తనతో పాటుగా పెద్దాయన కరుణ ఆశలను కూడా కుప్పకూల్చింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu