తెలంగాణలో డీఎస్సీ రద్దు..అంతా టీఎస్‌పీఎస్సీనే..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని కేసీఆర్ సర్కార్ రద్దు చేసింది. దీని స్థానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య జీవో నెం. 19 జారీ చేశారు. దీని ప్రకారం పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్ట్‌లను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించినట్లైంది. దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీ ద్వారా నియమిస్తుండగా..ఇకపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నియమించనున్నారు.

 

ఏకరూపకత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే  పాఠశాల విద్యా డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో పనిచేసే ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టు‌లను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. డీఎస్సీని తొలగించి టీఎస్‌పీ‌ఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీ చేపట్టాలని కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అనేక తర్జనభర్జనల తర్వాత ఇవాళ దీనికి ఒక స్పష్టత ఇచ్చింది. మరి ఈ నిర్ణయం పట్ల అభ్యర్థులు, విద్యావేత్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.