రాజీనామా చేయకుండా రాద్దాంతమేల?

 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఆయన చాలా ధీటుగానే బదులిచ్చారు. కానీ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసానని గొప్పగా చెప్పుకొంటున్న ఆయన వారడిగిన ప్రశ్నకు సూటిగా బదులీయకుండా తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయడం, అందరి బాగోతాలు బయటపెడతానని బెదిరించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఇటువంటి పొరపాటుని అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి కనుక తను చేయడం తప్పు కాదన్నట్లుంది ఆయన వాదన. అటువంటప్పుడు నైతిక విలువల గురించి చెప్పుకోవడం ఎందుకు?

 

స్పీకర్ కి ఇచ్చిన రాజీనామా లేఖను తను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని ఆయన చెపుతున్నారు. కానీ ఒకపక్క తను ఎప్పుడో రాజీనామా చేసానని చెప్పుకొంటూ దానిని 8 నెలలయినా ఆమోదింపజేసుకోనప్పుడు ఇక దానికి అర్ధం ఏముంటుంది? దానిని జేబులో పెట్టుకొని తిరగడం వలన ప్రయోజనం ఏముంటుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నైతిక విలువలకి కట్టుబడి ఉన్నానని తలసాని ప్రకటించుకొన్నప్పుడు, తను ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. కానీ అందరూ చేస్తున్న తప్పునే ఆయన చేయాలనుకొంటే ఇక నైతిక విలువల గురించి మాట్లాడటమే అనవసరం.

 

ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ చేతికి ఇచ్చేనని చెపుతుంటే, అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి తమకు ఆయన రాజీనామా చేరలేదని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. మరయితే ఆయన రాజీనామా లేఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్లు? అని గండ్ర అడుగుతున్న ప్రశ్నకు స్పీకర్ ద్వారా జవాబు చెప్పించగలిగితే బాగుండేది. కానీ అలా చేస్తే అప్పుడు “ఇంతకాలం తలసాని రాజీనామా లేఖను ఎందుకు ఆమోదించలేదు?” అనే ప్రశ్నకు స్పీకర్ సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది.

 

తను మళ్ళీ ఎమ్మేల్యేగా గెలవగలననే ధీమా ఉన్నందునే తను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదని తలసాని చెప్పుకొన్నారు. తెదేపా ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుని తనతో సనత్ నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలవమని, ఒకవేళ తను ఓడిపోతే రాజకీయల నుండి తప్పుకొంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. కానీ అసలు ఇంతవరకు తన రాజీనామానే ఆమోదింపజేసుకోకుండా ఆయన తన ప్రత్యర్ధులకు ఇటువంటి సవాళ్ళు చేయడం అర్ధరహితమనే చెప్పక తప్పదు.

 

ఇక రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన “రెండు రోజులు రాజకీయాలను కాదనుకొంటే...నాలుగు రోజులు ప్రభుత్వం లేదనుకొంటే నేనేమిటో చెపుతాను” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఆయన ఇవన్నీ మాట్లాడకుండా స్పీకర్ చేత తక్షణమే తన రాజీనామాను ఆమోదింపజేసుకొని ఉంటే ప్రతిపక్షాలకు గట్టి జవాబు చెప్పినట్లు ఉండేది. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా వాదోపవాదాలు చేయడం వలన ఆయనే స్వయంగా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నట్లవుతోంది. దాని వలన ఆయనకి, తెరాస ప్రభుత్వానికి మరింత అప్రదిష్ట కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu