ఆ కోణంలోనూ ఆలోచించండి గురూ
posted on Jul 22, 2015 10:42AM

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన టీడీపీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు వెలగబెడుతున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని, ఆయన్ని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని లేకపోతే గవర్నర్ అయినా ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉత్తుత్తి రాజానామా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి. అయినప్పటికీ ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్ అయిపోయింది. మిగతా విషయాల్లో ఎలా వున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నాయకులు తలసాని విషయంలో మాత్రం ఒకే మాటగా ముందుకు సాగుతున్నారు. టీటీడీపి ఈ విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించి గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విషయంలో సాధ్యమైనంత రచ్చ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ విషయంలో ఈ రెండు పార్టీల నాయకులు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి.
గండ్ర సమాచార హక్కు చట్టం ద్వారా శాసనసభ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే తలసాని రాజీనామా లేఖ తమ దగ్గర లేదని సమాధానం వచ్చింది. అయితే ఆ లేఖ స్పీకర్ కార్యాలయం దగ్గర వుండవచ్చు కదా. స్పీకర్ కార్యాలయం ఆ లేఖకు సంబంధించిన వివరాలను శాసనసభకు అందించకపోయి వుండవచ్చు కదా. అలా అందించి తీరాలనే నిబంధనలు ఒకవేళ ఉన్నప్పటికీ ‘‘స్పీకర్‌కి వుంటే అపరిమిత, విశేష అధికారాలు’’ ఆధారంగా సదరు లేఖను శాసనసభ కార్యాలయానికి పంపించి వుండకపోవచ్చు కదా. కొంతమంది స్పీకర్ కార్యాలయానికి కూడా ఈ లేఖ రాలేదని అంటున్నారు. ఒకవేళ తలసాని తన రాజీనామా లేఖను స్పీకర్‌కి ఇచ్చి వుండొచ్చు. ఆయన తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ ఆ లేఖను ఎక్కడకీ పంపకుండా తన దగ్గరే వుంచుకుని వుండొచ్చు...... ఇలాంటి తిరకాసులు, మతలబులు ఈ అంశం చుట్టూ వున్నాయి. అందువల్ల ఈ విషయంలో రెండు పార్టీలూ అన్ని కోణాల్లోనూ ఆలోచించి ముందడుగు వేయాలి. లేకపోతే ఈ పోరాటం చివర్లో తుస్సుమనే ప్రమాదం వుంది.