మంత్రా? వీధి రౌడీనా?
posted on Jul 22, 2015 11:54AM

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే మంత్రి పదవిలో వైభోగం అనుభవిస్తున్నారన్నది ఆయనపై తాజాగా వచ్చిన ఆరోపణ. ఆయన తాను రాజీనామా చేసినట్టుగా నాటకం ఆడి రాజ్యాంగాన్ని అవమానించారని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలూ అలుపెరుగని పోరాటం చేయడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నాయి. దీంట్లో భాగంగానే టీటీడీపీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఆయన ఒక రాష్ట్రానికి మంత్రా? లేక ఒక వీధి రౌడీనా అనే సందేహాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మంత్రిగారిని వీధి రౌడీతో పోల్చడం న్యాయం కాదు కదా అని ప్రశ్నిస్తే, ఒక్కసారి మంత్రిగారు మాట్లాడిన తీరును పరిశీలించండని అంటున్నారు.
తాను ఉత్తుత్తి రాజీనామా చేసి రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విషయంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఆయన మీద వుంది. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏదో ఒక కాగితాన్ని చూపించి నేను ఏనాడో రాజీనామా చేశానని అంటున్నారే తప్ప... ఆ విషయంలో స్పష్టంగా మాట్లాడలేదు. తన రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా స్పష్టంగా బయటపెడితే ఈ విషయంలో పోరాటం చేస్తున్న టీటీడీపీ, కాంగ్రెస్ నాయకులు చల్లబడేవారు. అయితే తలసాని అలా చేయకుండా తన హోదాను మరచిపోయి మాట్లాడారని పలువురు అంటున్నారు. తన జోలికి వస్తే ఖబడ్దార్ అని, తన జోలికి వచ్చిన వారి ఒక్కొక్కళ్ళ బతుకు బయట పెడతానని, తాను రాజకీయాలు వద్దని అనుకుంటే పరిస్థితి వేరే రకంగా వుంటుందని అనడం ప్రతిపక్ష నాయకులను ఒక వీధి రౌడీ తరహాలో బెదిరించినట్టే వుందని అంటున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న వ్యక్తిని వీధి రౌడీతో పోల్చడం మాత్రం న్యాయం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వీధి రౌడీ అని అంటున్నవాళ్ళు అలాంటి కామెంట్లు చేయకుండా వుంటే పద్ధతిగా వుంటుంది.