మజువాణితో తెలంగాణ బిల్లు ఆమోదం
posted on Feb 18, 2014 3:00PM
.jpg)
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై కేవలం 23 నిమిషాలు మాత్రమే చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్ సభ ఆమోదించింది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా పూర్తయినట్టే. ఇక బిల్లును రేపు లేదా ఎల్లుండి రాజ్యసభకు పంపనున్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే కావచ్చు.
60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరిందని, తెలంగాణ వాదులు సంయమనంతో ఉండాలని, సీమాంధ్ర సోదరులను అక్కున చేర్చుకుని అండగా ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కలిసింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ విజయం కేసీఆర్, జయశంకర్ లదే అని చెప్పారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ నగరంలో అందరూ హాయిగా బతకవచ్చని చెప్పారు. కోట్లాదిమంది తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేసిందని, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు.