జగన్ సర్కార్ పై స్వరూపానంద ఫైర్!
posted on Apr 24, 2023 9:47AM
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ఏపీ ప్రభుత్వ రాజగురువుగా గుర్తింపు పాందారు. ముఖ్యమంత్రి జగన్ తన మత విశ్వాసాలకు భిన్నంగా అయిన దానికీ కానీ దానికీ విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు పొందుతూ వచ్చారు. ఇందుకు జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న చెలిమి కారణమని కూడా చెబుతారు.
కేసీఆర్ ను ప్రసన్న చేసుకునేందుకు ఏపీ సర్కార్ తరఫున శారదా పీఠానికీ, స్వరూపాదనం కూ జగన్ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చారు. అయితే ఇప్పుడు అందంతా గతం. స్వరూపానంద ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పన్న చందనోత్సవ సమయంలో ఆయన చేసిన విమర్శలు జగన్ సర్కార్ ను నడిరోడ్డుపై నిలబెట్టేసినట్లుగా ఉన్నాయి. ఇంత కాలం దేవాలయయాలలో జరిగిన అపచారాలు, రధం దగ్ధం ఘటనలు, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న విపరీత నిర్ణయాలూ వేటినీ ప్రశ్నించని, పై పెచ్చు సమర్ధించిన స్వరూపానంద.. తాజాగా సింహాద్రి అప్పన్న చందనోత్సవ సమయంలో భక్తులకు కలిగిన అసౌకర్యానికి, ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఆయన ఫైర్ అయిపోయారు.
ఈవో ను నియమించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. టికెట్లను ఇష్టారీతిగా అమ్ముకున్నారనీ, అధికారులు వీవీఐపీలను, సంపన్నులను తప్ప సామాన్యులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. అసలు దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత కాలం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలిచిన స్వరూపానంద..ఇప్పుడిలా యూ టర్న్ తీసుకోవడానికి చందనోత్సవ వేళ భక్తులకు కలిగిన అసౌకర్యాలపై, అస్తవ్యస్త ఏర్పాట్లపై ఇంతలా ఫైర్ అయిపోయారేంటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు.
తిరుమలలో కాటేజీల రెంట్లు విపరీతంగా పెంచేసినప్పుడు కానీ, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తులకు కలిగిన ఇక్కట్ల గురించి కానీ నోరెత్తని స్వరూపానంద ఇప్పుడెందుకు జగన్ పేరెత్తకుండానే.. ఆయన పాలనా వైఫల్యమే అప్పన్న చందనోత్సవ కార్యక్రమం రసాబాసగా మారడానికి కారణమంటూ విమర్శలు గుప్పించారు? ఇటీవల స్వరూపానంద వారసుడు స్మాత్యేంద్రానంద… తాము ఏ పార్టీకి అనుబంధం కాదని ప్రకటించిన విషయాన్నీ ఈ సందర్భంగా జనం గుర్తు చేస్తున్నారు. అప్పన్న చందనోత్సవం కార్యక్రమం భక్తుల ను పక్కన పెట్టేసి పూర్తిగా వీఐపీల కోసం అన్నట్లుగా సాగిందని విమర్శలు గుప్పించిన స్వరూపానంద తాను స్వయంగా వీఐపీ దర్శనమే చేసుకున్నారు. భక్తుల ఆగ్రహావేశాలు, జగన్ సర్కార్ పట్ల జనంలో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను గమనించే స్వరూపానంద తన పీఠం గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే ఇలా విమర్శలు గుప్పించారని అంటున్నారు.
ఇంకా జగన్ ప్రాపకం కోసం పాటుపడితే.. తన పరువు, పీఠం పరువు గంగలో కలుస్తుందన్న భయంతోనే ఆయన సెల్ఫ్ ప్రొటక్షన్ కోసం ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. ఆ తరువాత మాట మార్చి.. తాను ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపలేదనీ, చందనోత్సవ వేళ భక్తుల ఇక్కట్లకు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని మాత్రమే విమర్శించాననీ చెప్పుకున్నా అది పెద్దగా జనంలోకి వెళ్ల లేదు. ప్రభుత్వ వైఫల్యం, అసమర్థతలపై స్వరూపానంద ఫైర్ అయ్యారన్నదే జనంలోకి బాగా వెళ్లింది.