రేవంత్ వర్సెస్ భట్టి.. కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ
posted on Apr 23, 2023 7:48AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కొంత సర్దుమణిగినట్లు కనిపించిన లేదా అనిపించించిన అంతర్గత కుమ్ములాటల వ్యవహారం మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ నేతలు, ఆయన వ్యవహార తీరు పట్ల గుర్రుగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అంటే అవమానంగా భావిస్తూ వచ్చారు. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చారు. మరోవంక అందుకు తగ్గట్టుగానే, రేవంత్ రెడ్డి ఆయన అనుచర వర్గం అధిష్టానం అండదండలతో సీనియర్లతో డోంట్ కేర్ అన్న ధోరణిలో కయ్యానికి కాలుదువ్వుతూ, సీనియర్ నాయకులను చులకన చేస్తూ వచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు గానీ, స్వయంగా రేవంత్ రెడ్డి చేసిన ఐపీస్.. హోం గార్డ్ వ్యాఖ్యలే కానీ, రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన విపక్ష్లాల ఉమ్మడి అభ్యర్హ్ది యశ్వంత్ సిన్హా’ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను ‘బండకేసి కొడతా’నంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇలా అనేక సందర్భాలలో స్వయంగా రేవంత్ రెడ్డి, అయన వర్గానికి చెందిన ఇతర నాయకులు సీనియర్లకు పొమ్మన కుండా పొగపెట్టి బయటకు పంపే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయనను పార్టీ నుంచి సాగనంపేందుకు సీనియర్లు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
చివరకు,మరో మార్గం లేక సీనియర్ నాయకులు, జాతీయ స్థాయిలో జీ 23 తరహాలో జీ 11 పేరుతో తిరుబాటు జెండా ఎగరేసారు. రేవంత్ రెడ్డి చేతిలో రాష్ట్ర వ్యవహారల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కీలుబొమ్మలా మారారని, ఆ ఇద్దరి వ్యావహార శైలి కారణంగా పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే, అధిష్టానం రేవంత్ రెడ్డిని కదల్చకుండా మాణిక్కం ఠాగూర్ పక్కకు తప్పించింది. అయన స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. మాణిక్‌రావు ఠాక్రే నియామకం తర్వాత పార్టీలో అంతర్గత తగాదాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల పంచాయతీ కొంత సర్డుమణిగినట్లు కనిపించింది. అయితే ఇప్పడు మళ్ళీ తెరపైకి మరో పంచాయతీ వచ్చింది.
ఓ వంక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఇటు నుంచి రేవంత్ అటు నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎక్కడిక్కడ తమ తమ పరిధిలో ఇతర ముఖ్య నాయకులు సాగిస్తున్న హత్ సే హాత్ జోడో యాత్రలు, మరో వైపు టీపీసీసీ పేపర్ లీకేజీకి వ్యతిరకంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు కొత్త వివాదానికి తెర తీశాయి.
ముఖ్యంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ వేదికగా రేవంత్ వర్సెస్ సీనియర్ల విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. విశేషం ఏమంటే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కొప్పుల రాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే సమక్షంలో సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి పట్ల తమకున్న వ్యతిరేకతను మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించారు. మల్లికార్జున ఖర్గేతో కలిసి వేదిక మీదికి వచ్చిన రేవంత్రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు భట్టి విక్రమార్క చేతులు పట్టుకొని వేదికపై నుంచి సభికులకు అభివాదం చేశారు. రేవంత్ రెడ్డి ప్రేక్షకుడిగా మిగిలి పోయారు. అంతేకాదు, వేదిక నుంచి మాట్లాడిన రాష్ట్ర నాయకులు విక్రమార్కను పొగడ్తల్లో ముంచెత్తారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ఆయనను దివంగత వైఎస్ఆర్ తో పోల్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అనుచరులు సీఎం భట్టి... సీఎం భట్టి అంటూ పెద్దపెట్టున నినదించారు. ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు సైతం విక్రమార్కను పొగుడుతూ మాట్లాడారు.
అదంతా ఒకెత్తు అయితే, చివరగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే అయినా, కార్యకర్తలతోపాటుగా వేదిక పై ఉన్న కొందరు నాయకులు సీఎం భట్టి అంటూ చేసిన నినాదాలను ఖండిస్తారని రేవంత్ వర్గం ఆశించింది. అయితే ఖర్గే అసలు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో, రేవంత్ రెడ్డి అసహనంగా కనిపించడమే కాకుండా, జిల్లాకు చెందిన ఆయన అనుచర వర్గం, రేవంత్ రెడ్డికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భట్టికి వ్యతిరేకంగా జిల్లా స్థయిలో తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సన్నహాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇంతవరకు రేవంత్ వర్సెస్ సేనియర్లు అన్నట్లుగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు ఇప్పడు రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్కగా కొత్త రూపం తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీ తగవుగా మారింది. మరో వంక టీఎస్పీఎస్సీ లీకేజీ నిరసనల విషయంలోనూ రేవంత్ రెడ్డి దూకుడుకు సీనియర్లు బ్రేకులు వేశారు. నల్గొండలో ఏప్రిల్ 21న జరగవలసిన నిరుద్యోగ నిరసన దీక్షకు సంబంధించి తనకు సమాచారమివ్వకుండా, తనతో చర్చించకుండా, తన జిల్లాలో నిరసన దీక్ష పెట్టడమేంటని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రభావంతో నల్గొండ నిరసన దీక్ష రద్దయింది. అలాగే 24న ఖమ్మంలో. 26న అదిలాబాద్ లో జరగవలసిన దీక్షల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భట్టి వర్సెస్ రేణుక చౌదరి మధ్య కొత్త పంచాయతీ ఒకటి తెరపైకొచ్చింది.
నిజానికి ఈ పరిణామాలను గమనిస్తే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ కుమ్ములాటలకు... ముగింపు ఉంటుందా...? అంటే ... పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు.మరో వంక సీనియర్ నాయకులు ఒకరొకరుగా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు, ఇప్పటికే రేవంత్ వ్యతిరేక వర్గానికి చెందిన మర్రి శశిధర్ రెడ్డి, మహేశ్వర్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే దాసోజు శ్రవణ్ వయా బీజేపీ ..బీఆర్ఎస్ లో చేరారు. అదే విధంగా, ఉత్తమ కుమార్ రెడ్డి సహా ఇతర సేనియర్ నాయకులు ఎన్నికల సమయానికి ఎవరి దారిన వారు పార్టీ మారినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అదే జరిగితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశలు పెంచుకున్న సామాన్య కార్యకర్తలకు నిరాశ తప్పక పోవచ్చని అంటున్నారు.