న్యాయవ్యవస్థపై గౌరవం ఇనుమడించింది.. రఘురామకృష్ణం రాజు
posted on Apr 24, 2023 10:18AM
వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ పై గౌరవాన్ని పెంచేదిగా ఉన్నదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు. ఇటీవల న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పులు ప్రజలలో అనుమానాలు, ఆందోళన రేకెత్తించాయనీ, అయితే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై గౌరవాన్ని ఇనుమడింప చేశాయన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తూ,ఇట్ ఈజ్ వెరీ అన్ ప్లెజెంట్ ఆర్డర్ అని వ్యాఖ్యనించడాన్ని ప్రస్తావిస్తూ, దేశ న్యాయవ్యవస్థకు నాయకత్వం వహించే ఏ న్యాయమూర్తి నేతృత్వంలోనైనా ఇటువంటి తీర్పును ఊహించి ఉండరనే అర్థం వచ్చేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్, నరసింహ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అవినాష్ కు ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టు తీర్పును తప్పుపట్టిందని పేర్కొన్నారు. ఇంటరాగేషన్ చేసే అధికారి ప్రశ్నలు అడిగే విధానంతోనే అవతలి వ్యక్తి సాంకేతికంగా విచారణ అధికారికి దొరికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రశ్నలను రాతపూర్వకంగా, సమాధానాలు రాతపూర్వకంగా ఇచ్చే వెసులు బాటును కల్పించడం అగెనెస్ట్ ప్రొసీజర్ ఆఫ్ లా అని, పోలీసుల విచారణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న నిబంధనను డాక్టర్ వైయస్ సునీత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లిన సంగతినీ ఆయన ప్రస్తావించారు.
ఈ సందర్భంగానే సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును అసాధారణ ఆర్డర్ అని, ఇటువంటి ఆర్డర్ ఇచ్చి ఉండవలసింది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడాన్ని రఘురామరాజు ఈ సందర్భంగా తెలిపారు. సునీత కోరుకుంటున్న న్యాయానికి ఈ దశలో మెయిన్ ఫౌండేషన్ అయిన ఒక అరెస్టు జరిగితే, ఆ తరువాత హత్య కేసులోని విస్తృత కోణం వెలుగులోకి వస్తుందేమో. ఇంకా ఏమైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అన్నది చూడాలని నర్మగర్భంగా రఘురామకృష్ణం రాజు అన్నారు.