స్వరూపానందకు ఏం కావాలి..?

ద్వారక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ మధ్య తరచుగా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి.. ఒక స్వామీజీగా ప్రవచనాలు చెప్పుకుంటూ, నలుగురికి మంచి విషయాలు చెప్పడం ఆయన విధి. 94 ఏళ్ల ఈయనకు ఈ వయసులో కావాల్సింది అంతకన్నా ఏముంది. కాని వాటికి భిన్నంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఆయన నిత్యకృత్యమైంది. మన రాజకీయ నాయకులు మాత్రమే నోరు జారుతూ ఉంటారనుకుంటే స్వరూపానంద వారినే మించిపోతున్నారు. లేటు వయసులో ఘూటు వ్యాఖ్యలతో ఫేమస్ అవుతున్నారు. ఇలా ఒకసారి కాదు..రెండు సార్లు కాదు..ప్రతి రోజు అదేపని.

 

తరతరాలుగా శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. అయితే భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు దీనిపై రచ్చరచ్చ చేయడం, చివరికి బాంబే హైకోర్టు కలగజేసుకుని స్త్రీలకు, పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానావకాశాలుంటాయని వీరిని ఆలయంలోకి అనుమతించాలని తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుతో శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్వరూపానంద మండిపడ్డారు. అగ్గికి ఆజ్యం పోసినట్టు వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో శని ఆలయంలోకి అడుగుపెట్టిన మహిళలే ప్రమాదాలకి కారణమంటూ స్వామీజీ ఆరోపించి వివాదానికి తెరలేపారు.

 

తర్వాత రోజు మళ్లీ దేనిపై మాట్లాడాలా అనుకుంటుండగా ఆయనకు దొరికిన అస్త్రం షిర్డీ సాయి. మరాఠ్వాడా ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకోవడానికి సాయిపూజే కారణమని ఆరోపించారు. అందరిలా సాయి దేవుడు కాదని ఆయన ఒక ఫకీరు మాత్రమే..అలాంటి వ్యక్తి పూజకు అనర్హుడని అందుకే దైవం దీనిపై ఆగ్రహించి కరువు పరిస్థితులు సృష్టించాడన్నారు. ఆ తర్వాత రోజు మరో బాంబు పేల్చడానికి ఆయనకు ఎలాంటి అస్త్రం దొరకకపోవడంతో మూడేళ్లు వెనక్కెళ్లారు. అప్పుడెప్పుడో 2013లో వచ్చిన కేథార్‌నాథ్ వరదలకు కారణం కొత్తజంటలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవతలు నడయాడిని నేల అనేక పుణ్యక్షేత్రాలు కొలువైయున్న పుణ్యధామం అని ఇలాంటి ప్రాంతాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి జనం వస్తారన్నారు. వీరిలో కొత్తగా పెళ్లయిన జంటలు కూడా ఉన్నారు..పవిత్రమైన ప్రదేశాల్లో వీరు సాగించిన అపవిత్రమైన కార్యకలాపాల వల్లే ప్రకృతి విలయం చోటు చేసుకుందని..వందలాది మంది మరణించారన్నారు.  

 

ఇప్పటికే స్వాములు, బాబాలు అంటే చులకన భావం ఎక్కువవుతుండగా ..ఇలాంటి మాటలు మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుందనే విషయాన్ని గమనిస్తే మంచిది. వేలాది సంవత్సరాలుగా ప్రజలు స్వామీజీలను మహానుభావులుగా, దైవాంశ స్వరూపులుగా భావించి పూజిస్తుంటారు. ఆధ్యాత్మిక చింతనతో అశాంతిని శాంతిగా మార్చే దైవదూతలుగా వ్యవహరించాల్సిన స్వాములు మనల్ని సన్మార్గంలో పెట్టాల్సింది పోయి వారు మార్గం తప్పుతున్నారు. సర్వం తెలుసంటున్న స్వాములోరు..ప్రకృతి విపత్తులు, కరువులు చోటు చేసుకోకుండా? మనుషుల్లో చెడును మంత్రం వేసి మాయం చేసేయొచ్చుగా..? అప్పుడు ఎవరితో ఏ సమస్య ఉండదు. మనదేశం, ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుంది.