గుంటూరు టీడీపీ నేతకు "సన్" స్ట్రోక్..!

గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ..నవ్యాంధ్రలోనూ ఆయన కీలక నేత. ఎన్టీఆర్ పిలుపుతో ఇష్టమైన వృత్తిని వదిలి రాజకీయ రంగంలోకి దూకిన వ్యక్తి. ఒకే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ప్రజలకు ఆయనంటే గౌరవం, ప్రత్యర్థులకు సింహస్వప్నం. రెండు పర్యాయాలు వరుసగా ఓడిపోవడంతో రీసెంట్‌గా నియోజకవర్గం మారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఉన్నత పదవినిచ్చి రికార్డుల్లోకి ఎక్కించారు. తనను గెలిపించిన కొత్త నియోజకవర్గ ప్రజలకు సదరు ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆయన్ను ప్రేమగా, గౌరవంగా చూసుకుంటున్నారు.

 

అలాంటి వ్యక్తికి కన్న కొడుకు తలబొప్పి కట్టిస్తున్నాడు. తండ్రికి వయసు మీద పడటంతో నియోజకవర్గం పాలనా బాధ్యతలను ఎక్కువగా కొడుకే చూసుకుంటున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువనేత తాజాగా మరో వివాదంలో ఇరుక్కుని తండ్రి పరువును గంగలో కలిపాడు. నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఈనాం భూములపై కన్నెసిన ఆ యువనేత తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. అప్పటికే ఆ భూమిలో ఒక రైతు సాగు చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన భూమి శిస్తు,  పట్టాదారు పాస్‌పుస్తకాలు తన దగ్గర ఉన్నా కానీ తన అనుమతి లేకుండా నకిలీ ఆధారాలతో తన భూమిని కాజేశారంటూ సదరు రైతు కోర్టు గుమ్మం తొక్కాడు. దీనిని విచారించిన న్యాయస్థానం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంతే సదరు యువనేతకు కోపం కట్టలు తెచ్చుకుంది. రైతు ఇంటి మీదకు తన అనుచరులను పంపి దాడి చేయించాడు.

 

ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు. వాళ్లకి ఎదురు తిరిగితే ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడిపోతాయోనని భయపడుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యేగారి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏమి చేయలేని పరిస్థితి అసలే ఒక కొడుకు దూరం కావడంతో మరో కొడుకుని కోల్పోయే స్థితిలో ఆయన లేరు. అందుకే కొడుకు ఏం చేసినా మారు మాట్లాడలేకపోతున్నారు. మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో ఆయన ఎమ్మెల్యే మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పార్టీ పరువు, ప్రభుత్వం పరువు ఒకేసారి తీస్తున్న కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం సీరియస్ అయ్యారు. ప్రజలు మాత్రం అలాంటి కొడుకు కడుపు ఇలాంటి కొడుకు పుట్టాడేంటి అని బాధపడుతున్నారు