అమెరికన్లను చంపించిన ఐఎస్ఐ..!
posted on Apr 15, 2016 2:42PM

ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సింపుల్‌గా ఐఎస్ఐ.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను చూసుకునే ఈ సంస్థ భారతదేశంలో అలజడులు సృష్టించడం..రక్తాన్ని పారించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి ఈ సంస్థ అమెరికా విషయంలో పెద్ద తప్పు చేసింది. అమెరికన్లను చంపడానికి ఉగ్రవాదులతో చేయి కలిపింది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ.
ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి సంస్థలతో ఐఎస్ఐకి సంబంధాలున్నట్లు తమ పరిశీలనలో తెలినట్టు తెలిపింది. అంతేకాకుండా 2009లో అఫ్ఘనిస్థాన్‌లోని ఓ క్యాంప్‌పై దాడికి పాల్పడేందుకు దాదాపు రెండు లక్షల డాలర్లను ఐఎస్ఐ హుక్కానీకి చెల్లించిందని ప్రకటించింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్లు, కాంట్రాక్టర్లు, మరి కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మాట్లాడితే ఏ ఉగ్రవాద సంస్థకు తమకు ప్రీతి, పక్షపాతం లేదని, వారిపై చర్యలు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తరచూ చెప్పే పాకిస్థాన్‌కు అమెరికా ప్రకటన మింగుడు పడటం లేదు.
అంతటి సరిపెట్టని అమెరికా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అది అలాంటి ఇలాంటి వార్నింగ్ కాదు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. లేదంటే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో అమెరికా ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు పాక్ కపట బుద్ధి అమెరికాకు అర్థమైంది. ఇంతకాలం భారత్ చెబుతున్నా పట్టించుకోని అగ్రరాజ్యం ఇప్పటికైనా కళ్లు తెరిచింది. మరి అమెరికా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో పాక్‌కు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇటు ఉగ్రవాదులు కావాలి..అటు అమెరికాతో బంధం కావాలి మరి పాక్ ఎత్తుగడ ఏంటో.