ఆ చెత్తనీ ఊడ్చేయండి కేసీఆర్ జీ




భారత ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసమో లేక మరో ప్రయోజనాన్ని ఆశించో లేక నిజంగానే చెత్త విషయంలో చిత్తశుద్ధితోనే కేసీఆర్ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని చాలా పకడ్బందీగా ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ని అమలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. మంత్రులు, అధికారులతోపాటు తాను ఒక ప్రాంతాన్ని బాధ్యతగా తీసుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కీ ఒక ప్రాంతం బాధ్యత అప్పగించారు. నగరాన్ని పరిశుభ్రంగా వుంచడం  కేవలం పారిశుద్ధ్య కార్మికుల పని మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెత్తను ఊడ్చి చెత్తకుండీల్లో వేశారు. ఇలా ఆయన చాలా మంచి పని చేశారు. ఇలా మరో చెత్తను కూడా ఆయన ఊడ్చేస్తే మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకుంటారు. ఆ చెత్త మరేదో కాదు... ప్రభుత్వ అధికారుల రూపంలో, కొంతమంది అమాత్యవర్యుల రూపంలో పేరుకుపోయిన చెత్త.

అవినీతి అనేది దేశంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. రాజకీయ నాయకులుగానీ, ప్రభుత్వాధికారులు గానీ అవినీతికి పాల్పడకపోతే వారిని అసమర్థులుగా భావించే దుర్మార్గపు రోజులు వచ్చేశాయి. దేశం మొత్తం స్వచ్ఛంగా వుండాలని కోరుకునేవారు ఎవరైనా సరే, అవినీతి విషయంలో కూడా దేశం స్వచ్ఛంగా వుండాలని భావించాలి. మరి  స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టిన కేసీఆర్ కూడా అవినీతి విషయంలో కూడా ఆ స్వచ్ఛతని అమలు చేసి చూపించాలి. చేత చీపురు పట్టి చెత్తని ఊడ్చేసినట్టుగా ప్రభుత్వంలో వున్న అవినీతిని కూడా ఊడ్చేందుకు చొరవ చూపించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వాధికారుల అవినీతి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. పైసలు లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగని పరిస్థితి. అలాగే మంత్రివర్గంలోని కొంతమంది మంత్రుల మీద భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇలాంటి ఆరోపణలే వచ్చిన మంత్రి రాజయ్యని పదవుల నుంచి తొలగించి ‘స్వచ్ఛ మంత్రివర్గం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలి. అధికారులుగానీ, మంత్రులుగానీ అవినీతి చేయాలంటే భయపడిపోయే విధంగా చేయాలి. అంటే, ఇప్పుడున్న అవినీతి చెత్తని ఊచ్చేసి, కొత్త చెత్త పోగుపడకుండా చూడాలి. ‘స్వచ్ఛ’తకు సరైన నిర్వచనాన్ని దేశానికి తెలియజేయాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu