రాహుల్ గాంధీ నిప్పు రాజేశాడు



మొత్తానికి రాహుల్ గాంధీ భలేవాడే... తెలంగాణలో పాదయాత్ర చేశాడు... ఇక్కడ రాజకీయ నిప్పు పెట్టి వెళ్ళాడు. అయ్యగారు ఎక్కడ లెగ్గుపెట్టినా ఇంతేనేమో. రైతు పరామర్శ యాత్ర కోసం వచ్చిన ఆయన వచ్చిన పని చూసుకుని వెళ్ళకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేశాడు. ఆ చేసే విమర్శలు కూడా సూటిగా సుత్తిలేకుండా చేయకుండా కేంద్రంలో వున్న మోడీకి, రాష్ట్రంలో వున్న కేసీఆర్‌కి లింకుపెట్టి మరీ విమర్శలు చేశాడు. కేసీఆర్ని ఆయన ‘మినీ మోడీ’ అని విమర్శించి కొత్త పదాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ నాయకులకు పౌరుషాన్ని తెప్పించాయి. అయితే మొట్టమొదట ఈ వ్యాఖ్యల మీద స్పందించిన పార్టీ ఏదో తెలిస్తే రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోతాడేమో.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కేసీఆర్‌తో మోడీని పోల్చడం పట్ల స్పందిస్తే ఎవరు స్పందించాలి? మా నాయకుడిని మోడీతో పోల్చుతావేంటంటూ టీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలి. లేకపోతే కేసీఆర్‌కి, మోడీకి పోలిక ఏంటని బీజేపీ వాళ్ళు స్పందించాలి. ఈ ఇద్దరూ కాకుండా ఈ అంశం మీద తెలుగుదేశం నాయకులు స్పందించారు. అఫ్‌కోర్స్... రాహుల్ గాంధీని టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా వదిలిపెట్టరనుకోండీ... అయినప్పటికీ మొదట స్పందించిన క్రెడిట్ మాత్రం తెలంగాణ టీడీపీ సొంతం చేసుకుంది. కేసీఆన్ని మోడీతో పోల్చడం మీద టీటీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. నరేంద్రమోడీ గంగా నది లాంటివాడు అయితే, కేసీఆర్ మూసీ నది లాంటివాడని, ఆయనతో ఈయన్ని పోల్చడం ఏంటని వాళ్ళు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా టీటీడీపీ నాయకులు కేసీఆర్ని విమర్శల వర్షంతో తడిపేశారు. కేసీఆర్ పాలన మీద తమకున్న వ్యతిరేకత అంతా వ్యక్తం చేసేవారు. కేసీఆర్ పాలన మీద వాళ్ళకున్న ఆగ్రహం ఏ స్థాయిలో వుందో వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక టీటీడీపీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళూ ఘాటు కామెంట్లు చేస్తారు... ఇక ఈ విమర్శల పర్వం ఈ అంశంమీద కొంతకాలం ఇలాగే కొనసాగుతుంది. ఈ గొడవకి కారణమైన రాహుల్ గాంధీ మాత్రం తాను తెలంగాణలో పర్యటించిన విషయాన్ని కూడా మరచిపోయి ఢిల్లీలో హాయిగా రెస్టు తీసుకుంటూ వుంటాడు. ఏంటో ఈ రాజకీయాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu