వివేకా హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం కోరిన సుప్రీం

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం (జులై 21)  సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీతతో పాటు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బెయిలుపై ఉన్న నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్ధ్​లూద్రా వివరించారు.  ఈ విషయంలో సీబీఐ తన అభిప్రాయాన్ని చెప్పాక  బెయిల్ రద్దు పై విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

మూడు విషయాలలో సీబీఐ తన అభిప్రాయం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఇంకా  దర్యాప్తు అవసరమా?  ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైన, కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా?  అన్న అంశాలపై  సుప్రీం కోర్టు సీబీఐ అభిప్రాయాన్ని కోరింది. వివేకా హత్య కేసులో  అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ  సీబీఐ, సునీత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.  సీబీఐ ఈ మూడు అంశాలపై అభిప్రాయాన్ని తెలిపిన తరువాత బెయిలు రద్దు పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.