క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఏ12 బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు
posted on Jul 22, 2025 9:44AM

వైసీపీ నేతలు, శ్రేణులను అరెస్టు భయం వణికించేస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన తప్పుడు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడటంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు అజ్ణాతంలోకి వెళ్లి కోర్టు బెయిలు మంజూరు చేస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇక తాజాగా మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో స్కాములు, దాడులు, దౌర్జన్యాలు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన వైసీపీయులు వరుసగా అరెస్టు అవుతున్నారు. ఇప్పడు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు సోమవారం (జులై 21)నఅరెస్టు చేశారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిథి రమేష్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసి మదనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, పెద్దఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఏ 12 నిందితుడిగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. గత కొంత కాలంగా నెల్లూరు జిల్లా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బిరదవోలు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకున్న నెల్లూరు జిల్లా పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేసి ఏపీకి తరలించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు.
ఇక రమేష్ రెడ్డి ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు చేశారు. లక్కిరెడ్డిపల్లిలో అరెస్టు చేసిన రమేష్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య మదనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.