తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం.. సుప్రీం ఆదేశం
posted on Jul 31, 2025 11:10AM

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సూచిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో నిర్ణయంపై స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కాగా గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవలసింది స్పీకర్ మాత్రమేనని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు గడువు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది.
వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుపై అధికారం పూర్తిగా స్పీకర్ దే. ఆ చట్టంలో ఎటువంటి గడువు కూడా నిర్దేశించలేదు. అందుకే సుప్రీం గతంలో కూడా సూచనలు జారీ చేసిందే కానీ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం తాజా తీర్పులో కూడా అనర్హత అంశాన్ని సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టడం సరికాదంటూ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అదే సమయంలో అదే సమయంలో న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్లను తోసిపుచ్చింది.