ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించనుంది. తెలంగాణలో  2023లో జరిగిన ఎన్నికల తరువాత పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటిని వీడి కాంగ్రెస్ పంచన చేరారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.   జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత విషయంపై గురువారం (జులై 31) తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.  

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఈ ఏడాది జనవరి 15న పిటిషన్లు దాఖలయ్యాయి.  జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి ప్రకాశ్ గౌడ్, ఎ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు. ఇలా ఉండగా.. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పంచన చేరిన పది మంది ఎమ్మెల్యేలలో ఒక్క దానం నాగేందర్ వినా, మిగిలిన తొమ్మిది మందీ తాము పార్టీ మారలేదని చెబుతున్నారు.

అయితే దానం నాగేందర్ కు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన ఓడిపోయారనుకోండి అది వేరే విషయం. కానీ తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి దానంకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తూ సుప్రీం తీర్పు వెలువడితే.. తెలంగాణలో పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికల జరగడం అనివార్యం అవుతుంది. దీంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కుతుందనడంలో సందేహం లేదు. చూడాలి మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu