మంచి ఆరోగ్యానికి ఇవి పాటించడం తప్పనిసరి!

ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా అవసరం...! ఆరోగ్యంగా ఉంటేనే ఆ మనిషి దేనినైనా సాధించగలడు...! ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అంటే సాధించాల్సిన గొప్ప విషయం అయిపోయింది చాలామందికి. కారణం ఏమిటంటే చిన్న వయసు నుండే మెల్లి మెల్లిగా ఆరోగ్య సమస్యలు చిగుర్లు వేస్తాయి. పాతిక సంవత్సరాల వయసు వచ్చేసరికి సమస్యల వయలం చుట్టూ ముడుతుంది. ఇక 30 ఏళ్ళు దాటితో జబ్బులు, వ్యాధులతో సహవాసం చేస్తూ సంసారపు బండి లాగాల్సి వస్తోంది. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించినట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలం...! అందుకోసం మనం చెయ్యాల్సిన మొదటి పని తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం  పండ్లు తీసుకోవడమే...! పండ్ల కంటే కూరగాయలు మరింత అధికంగా తీసుకోవాలి...!

ఎందుకంటే వాటిలో ఎక్కువగా  విటమిన్లు లభ్యమవుతాయి. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. షుగరు వాడేటప్పుడు ఎక్కువగా రిఫైండ్ షుగర్స్ వాడకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్ లలో, కేకులలో, తీపి పదార్ధములలో ఉంటుంది. మీరు పంచదార కన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు. ఇవి మాత్రమే కాదు తాజా కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. టమోటోలు, దోసకాయ, పాలకూర, మొదలైన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం మాత్రమే కాదు ఐరన్, కెరోటెన్, రిబో ఫ్లోవిన్, విటమిన్ 'సి', ఫోలిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. 

కబాట్టి  ఎక్కువగా ఆకుకూరలు తినటం ఆరోగ్యానికి మంచిది. తాజా పండ్లు, బత్తాయి, యాపిల్, బొప్పాయి, తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే లెమన్ జ్యుస్ కూడా మంచిదే. అందులో విటమిన్ 'సి' ఉంది. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలి అనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసం నీటితో కలిపి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటుంది. కళ్ళు కళకళలాడుతూ మెరుస్తూ ఉంటాయి. నిమ్మరసం, నీళ్ళల్లో కొంచెం తేనె కూడా మిక్స్ చేస్తే మంచిది. ప్రతిరోజూ 1,2 గ్లాసుల వరకు బత్తాయి జ్యూస్ తీసుకోవడం మంచిది.  దీనివల్ల చర్మం మెత్తబడుతుంది. చర్మం మీద పొడలుంటే పోతాయి.

చాలామందికి కాఫీ, టీ అనేవి వ్యసనంలా ఉంటాయి.  కానీ ఎక్కువగా కాఫీ, టీ త్రాగకూడదు. చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతిరోజూ  నీటిని  పుష్కలంగా త్రాగాలి. మీ శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేయడానికి మంచి నీరుకు మించింది లేదు. తరువాత చిలికిన మజ్జిగ త్రాగడం మంచిది. వెన్నపూస తీసిన పాలు మంచివి. నిమ్మరసం వంటికి చాలా శ్రేష్టం. మన శరీరానికి అవసరమైన 'మెగ్నీషియం' దోసకాయలలో, ఉల్లిపాయలలో, యాపిల్ పండ్లలో, బాదంపప్పులో లభిస్తుంది. అలాగే పాస్ఫరస్ దుంపకూరలలో, పులుపుగా ఉండే పండ్లలో, కోడిగ్రుడ్డు సొనలో, చేపలలో, జున్నులో, మజ్జిగలో, బాదంకాయలలో, ఎక్కువగా లభిస్తుంది. 'కాల్షియం' కోడిగ్రుడ్లలో, డైరీపాల ప్రొడక్టులో లభిస్తుంది. ఇలా విటమిన్లు, ప్రోటీన్లు, అవి లభించే పదార్థాల గురించి అవగాహన పెంచుకుని మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు...!

                                     ◆నిశ్శబ్ద.