హ్యాండ్ వాష్ కూ ఒక డే ఉంది తెలుసా!

పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. మన శుభ్రతే మనల్ని కాపాడుతుంది. హ్యాండ్‌ వాష్ చేయడం అనేది  ప్రతిరోజూ తినడానికి ముందు చేసే పనే.  ఎప్పటి నుండో పెద్దలు తినడానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోపో…. అని చెబుతూ వస్తున్నారు. అంతేనా బయటకు వెళ్లి బాగా తిరిగి ఇంటికి వచ్చాక కూడా కాళ్ళు చేతులు కడుక్కోమని చెబుతూనే ఉన్నారు. ఇది ఇప్పటి అలవాటు కాదు భారతీయులకు.  అయితే చేతులు కడుక్కోవడాన్ని ఇంగ్లీష్ లో హ్యాండ్ వాష్ అనేసి, దానికోసం  కూడా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేసినట్టు, దాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటారని చాలా తక్కువమందికి తెలుసు.

అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డే. ఇంతవరకు దీనికంటూ ఒక ప్రత్యేక రోజుందని తెలియకపోయినా దాన్ని మనం సహజంగానే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి పెద్దగా ప్రత్యేకత చూపించం. కానీ గత రెండు సంవత్సరాల కిందట కోవిడ్ మహమ్మారి చేసిన భీభత్సానికి చేతులను సానిటైజర్ తో పదే పదే కడగాల్సి వచ్చింది. చేతులు ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి అనే విషయం కూడా బానే అర్థమయ్యింది అందరికీ ఆ బీభత్సం కొనసాగినన్ని రోజులూ. కానీ ఈ హ్యాండ్ వాష్ డే ను 2008 నుండే స్టార్ట్ చేశారు. దాని గురించి కాస్త వివరంగా…..

అసలు ఈ హ్యాండ్ వాష్ డే ఎందుకు??  ఎలా పుట్టిందంటే…..

ప్రజలు చాలా అనారోగ్యాల బారిన పడేది ఆహారం ద్వారా, నీటి ద్వారా. ఈ పదార్థాలు ఎంత శుభ్రతగా ఉన్నా తినే చేతులు శుభ్రంగా లేకపోతే సహజంగానే చేతులకు ఉన్న మురికి, బాక్టీరియా వంటివి కడుపులోకి వెళ్ళిపోయి జబ్బులు కలిగిస్తాయి. అందుకే ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 వ తేదీన వరల్డ్ హ్యాండ్ వాష్ డే జరుపుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలైన వాటిలో పనిచేసేవారికి, పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా చేతుల ద్వారా వ్యాప్తి చెందే కొన్నిరకాల జబ్బులను అరికట్టవచ్చు. 

కొన్ని ముఖ్యమైన విషయాలు!!

1980 సంవత్సరంలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన వరల్డ్ వాటర్ వీక్‌ లో గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డే ఆవిర్భవించింది. 

అయితే 2008 లో ప్రపంచ వ్యాప్తంగా దీన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. 

2008 అక్టోబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా  120 మిలియన్లకు పైగా పిల్లలు, సుమారు 70 దేశాలలో సబ్బుతో చేతులు కడుక్కుని దీన్ని ప్రారంభించారు.

2008లో గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డేలో పాల్గొన్న దేశాల్లో భారతదేశం ఒకటి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంకా అతని సహచరులు మెరుగైన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడంలో 100 మిలియన్ల మంది పిల్లలతో చేరి దీన్ని విజయవంతం చేశారు.

ప్రస్తుతం, 17 దేశాల్లో 10 మిలియన్ల మందికి పైగా హ్యాండ్‌ వాష్ సౌకర్యాలు లేవు.

పై విషయాలు గమనిస్తే చేతులు కడుక్కోవడం గురించి అవగాహన కల్పించడానికి కూడా ఒకరోజు కేటాయించుకోవడం అనేది సబబుగానే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ నేర్పిన గుణపాఠం మర్చిపోలేనిది కదా. టీవీ యాడ్ లో చూపినట్టు చేతులను అటు రుద్ది, ఇటు రుద్ది, గోళ్లలో మురికి పోయేలా శుభ్రంగా కడుక్కోవడం మంచిదే.. 

                                        ◆నిశ్శబ్ద.