మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి. 

 ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం. 

మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.  

ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు.

ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు. 

అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని. 

                                       ◆నిశ్శబ్ద.