నాయకుడంటే రాముడిలా ఉండాలి

 

రామాయణం జరిగి వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈలోగా మనిషి మారాడు. అతని నాగరికత మారింది. కానీ రామాయణంలో కనిపించే మౌలిక సూత్రాలు తరతరాలని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాముడు సీతను వదిలేయకుండా ఉండాల్సిందా? వాలిని చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాడు? అన్న అంశాలలో వాదులాటలని పక్కన పెడితే, మంచి విషయాలు నేర్చుకునేందుకే రామాయణంలో చాలా సందర్భాలే కనిపిస్తాయి.

సమర్ధుడైన నాయకత్వం
అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె
ట్లవగుణలైన నేమి పనులన్నియుఁజేకుఱు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే
దవిలి యొనర్పవే? జలధి దాటి సూరారులద్రుంచి భాస్కరా!
రాజు నేర్పరి అయితే ఎలాంటివారితో అయినా పనులని చక్కపెట్టుకోగలడు. రాముడు తన కార్యాన్ని వానరులతోనే సాధించగలిగాడు కదా అంటాడు మారయ కవి భాస్కర శతకంలో! నాయకుడు సమర్థుడైతే ఎవరితో అయినా, ఎంతటి లక్ష్యాన్నయినా సాధించగలడు అనేందుకు రాముడే గొప్ప ఉదాహరణ.

విద్యను ఆచరణలో పెట్టాలి

విద్యని నేర్చుకోవడం కష్టమే... కానీ ఆచరణలో ఉపయోగపడాలి కదా! రాజ్యాన్ని పాలించేవాడు యుద్ధవిద్యలు నేర్చుకోవడమే కాదు... అవసరం అయినప్పుడు రణరంగంలో తన సత్తా చూపించేందుకూ సిద్ధంగా ఉండాలి. అందుకే రాముడు తన కులగురువైన వశిష్టుని వద్ద సకల విద్యలనూ నేర్చుకోగానే... ఆతణ్ని యుద్ధానికి తీసుకువెళ్లేందుకు విశ్వామిత్రుడు తొందరపడ్డాడు. తనతోపాటుగా రాముని అడవులకు తీసుకువెళ్లి... అక్కడ ఒక పక్కన అతనితో రాక్షసుల మీద యుద్ధం చేయిస్తూనే, మరో పక్క యుద్ధంలో తనకు తెలిసిన మెళకువలు కూడా నేర్పాడు. ఇంతకు మించిన field trip ఉంటుందా!

అనువుగాని చోట

ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అన్న మాట ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అనువుగాని చోట అధికులమనరాదు అంటూ ఇదే విషయాన్ని వేమన ఎప్పుడోనే చెప్పాడు. ఇందుకు గొప్ప ఉదాహరణ రాముడు శివధనుస్సుని విరిచిన సందర్భమే! తనకు వరప్రసాదంగా లభించిన శివధనుస్సుని రాముడు పాడుచేశాడన్న కోపంతో పరశురాముడు, రాముని మీద కాలు దువ్వుతాడు. అతణ్ని రెచ్చగొడుతూ పరుషంగా మాట్లాడతాడు. కానీ రాముడు కూడా అవతార పురుషుడే అని పరశురాముడు తనంతట తానుగా గ్రహించేవరకూ... రాముడు తన సహనాన్ని కోల్పోలేదు.

కలుపుకొంటూ పోవాలి

సీతమ్మ జాడ కనిపించకపోయాక... రాముడు ఆమెను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో సుగ్రీవుడనే వానరరాజుతో స్నేహం చేశాడు. చివరికి వారిసాయంతోనే సీతమ్మను సాధించాడు. తను దేవుడు కదా, వానరుల సాయం కోరడం ఏమిటి అని రాముడు ఆలోచించలేదు. దారిలో తన కార్యసాధనకు తోడుగా నిలిచేవారందరినీ కలుపుకొంటూ పోయాడంతే! మరి రావణాసురుడో... తనకు మంచి చెప్పినందుకు తమ్ముడైన విభీషణుని సైతం దూరం చేసుకున్నాడు. చివరికి అతను అందించిన రహస్యం కారణంగానే చావుని కొనితెచ్చుకొన్నాడు.

ధర్మాన్ని పాటించాడు

సమాజంలోని ప్రజలంతా కలిసి జీవించేందుకు కొన్ని నిబంధనలను ఏర్పరుచుకుంటారు. దానినే ధర్మం అని పిలుచుకుంటాము. ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు తండ్రి మాటను జవదాటకపోవడం రాముని కాలంలోని ధర్మం! అది ఈ కాలంలో వర్తిస్తుందా అంటే చెప్పడం కష్టం. రాముడు తన ధర్మాన్ని నూటికి నూరుపాళ్లూ పాటించాడంటారు పెద్దలు. అందుకే ఆయన పాలనను రామరాజ్యంగా కలకాలం గుర్తుంచుకున్నారు.

రామాయణాన్ని కేవలం ఒక ఇతిహాసంగా కాకుండా, మంచిచెడులను తెలిపే గ్రంథంగా మరోసారి చదివితే ఇలాంటి విషయాలు ఎన్నో తటస్థపడతాయి. మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి.

- నిర్జర.