సంతోషం ఎక్కడ ఉంది?

ఒకప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారట. ప్రపంచమంతా నిత్యం ఆనందడోలికల్లో తేలిపోతుండేది. సంతోషంగా ఉండీ ఉండీ జనాలకి మొహం మొత్తేసింది. దాని విలువే తెలియకుండా పోయింది. ఎంతటి నీచులైనా, పనికిమాలినవారైనా హాయిగా సంతోషంగా ఉండసాగారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సృష్టికర్త ఒక సభను ఏర్పాటుచేశాడు.

‘సంతోషం మరీ తేలిగ్గా దొరుకుతోంది. కాబట్టి దానికోసం ప్రజలు తపించిపోయేలా... దాన్ని ఎక్కడన్నా భద్రపరచాలి. ఎక్కడ భద్రపరచాలో మీమీ ఉపాయాలు చెప్పండి,’ అన్నాడు సృష్టికర్త.

‘ఇందులో చెప్పేదేముంది. సంతోషాన్ని సముద్రగర్భంలో దాచిపెడితే సరి,’ అని సూచించాడో దేవత.

‘అబ్బే! మనిషి అసమాన్యుడు. అతను సముద్రగర్భాన్ని సైతం చేరుకోగలడు. మరో మార్గం ఏదన్నా చెప్పండి,’ అని సూచించాడు సృష్టికర్త.

‘హిమాలయ పర్వతాలలోని అడవుల మధ్య ఓ చిన్న పెట్టెలో దాచిపెడితే ఎలా ఉంటుంది,’ అని సూచించాడు మరో దేవత.

‘అహా! మనిషి అక్కడకి కూడా తేలికగా చేరుకోగలడు. మరో మార్గాన్ని సూచించండి,’ అని పెదవి విరిచాడు సృష్టికర్త.

ఆ తరువాత చాలా సలహాలే వినిపించాయి. అగ్నిపర్వతంలో దాచమనీ, కొండల కింద పాతిపెట్టమనీ, ఆకాశంలో వేలాడదీయమనీ... ఇలా సంతోషాన్ని దాచేందుకు రకరకాల ఉపాయాలు సూచించారు దేవతలు. కానీ అవేవీ సృష్టికర్తకు తృప్తినివ్వలేదు. చివరికి ఒక యువదేవత లేని నిలబడ్డాడు...

‘మీరంతా ఏమనుకోకపోతే నాది ఒక చిన్న విన్నపం. మనిషి ఈ ప్రపంచాన్నంతా శోధించే ప్రయత్నం చేస్తాడు కానీ తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే చేయడు. కాబట్టి మనిషి మనసులోనే సంతోషాన్ని దాచిపెట్టేస్తే సరి! అతను ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు,’ అని సూచించాడు.

‘అద్భుతమైన ప్రతిపాదన. నిత్యం భౌతికమైన విషయాలలో మునిగితేలే మనిషి ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు. తన విచక్షణకు విలువనిచ్చేవాడు మాత్రమే తనలోని సంతోషాన్ని పొందగలడు,’ అంటూ దేవతలంతా ఆ ప్రతిపాదనను ఏకాభిప్రాయంతో అంగీకరించారు.

అప్పటి నుంచి సంతోషం మన మనసులోనే ఉండిపోయింది. దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.