ముచ్చింతల్‌లో ఇల వైకుంఠం!.. రామానుజ దివ్యక్షేత్రం విశేషాలివే...
posted on Feb 5, 2022 11:01AM
అలా వైకుంఠపురం.. ఇలా ఇలకు దిగివచ్చిందా అనిపిస్తుంది. మానవ సృష్ఠి వైకుంఠం అది. 216 అడుగుల ఎత్తులో సమతామూర్తి దర్శనం. భగవత్ రామానుజుల 108 అడుగుల విగ్రహం. 18 వేల టన్నుల ప్రతిమ. కూర్చున్నట్టు నిర్మించిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. 108 దివ్య దేశాల సందర్శనం. మూడంతస్తుల ‘భద్రవేది’. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత జోడించి.. అత్యద్భుత దివ్యక్షేత్రాన్ని నిర్మించారు. ముచ్చింతల్‌లో ‘సమతా మూర్తి’- స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ.
మూడంతస్తుల శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహ పీఠాన్ని ‘భద్రవేది’గా పిలుస్తారు. మహా విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మాణాలన్నీ సంఖ్యా శాస్త్రం ప్రకారం నిర్మించారు. సంఖ్య, పొడవు, విస్తీర్ణాలకు సంబంధించిన అంకెలు ఏవి కూడినా చివరకు ‘9’ వస్తుంది. రామానుజుల మహా విగ్రహం ఎత్తు 216 అడుగులు.. 2+1+6 కూడితే 9. భద్రవేది ఎత్తు 54 అడుగులు. 5+4=9. ఇలా సంఖ్యాశాస్త్ర స్వరూపమే భద్రవేది. ఇందులో మూడు అంతస్తులుంటాయి. చతురస్రాకృతిలో నిర్మితమై.. మధ్యలో ముఖ భద్రాలతో కూడి ఒక ‘శ్రీ’ యంత్ర ఆకృతిని ఇది పోలి ఉంటుంది.
మొదటి అంతస్తులో ‘సువర్ణమూర్తి’.. ఇక్కడ రామానుజులు ‘సువర్ణమయ అర్చా మూర్తి’గా కొలువై ఉంటారు. దీనిని ప్రసన్న శరణాగత మండపం అని పిలుస్తారు. శ్రీరామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించినందుకు గుర్తుగా 120 కిలోల బంగారంతో 54 అంగుళాల (4.5 అడుగులు) రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇందులో 36 అంగుళాల ఎత్తైన పీఠం మీద 54 అంగుళాల ఎత్తైన సువర్ణమూర్తి కొలువై ఉంటారు. విగ్రహంపై పంచవర్ణాల విద్యుత్ దీపాలు అమర్చడంతో నిత్యం ధగధగలాడుతూ మెరుస్తుంది. ఇక్కడ స్వామికి అభిషేకం, నైవేద్యాలతో నిత్య పూజలు జరుగుతాయి. ఇందులో నక్షత్రాకృతిలో 48 స్తంభాలు; వాటిపై 32 బ్రహ్మవిద్యల శిల్పాలు కనువిందు చేస్తాయి. అలాగే, బంగారు రామానుజుల చుట్టూ ‘మకరానా’ మార్బుల్‌తో ఫ్లోరింగ్ నిర్మించారు. మిగతా ప్రాంతమంతా ఇటాలియన్ మార్బుల్స్‌తో ఫ్లోరింగ్ చేశారు. గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులతో తాపడాలు తొడిగారు. మొత్తం భద్రవేదిని బన్సీ పహడ్‌పూర్ పింక్ స్టోన్‌తో నిర్మించారు.
రెండో అంతస్తులో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వానికి కృషి చేసిన మహనీయుల చరిత్రను ఇ క్కడ ఉంచారు. దీనిని 16,740 అడుగుల విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. మూడో అంతస్తులో ‘పద్మపీఠం’పై రామానుజుల విగ్రహం ఉంటుంది. ఇందులో 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. దీని చుట్టూ 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉంటాయి. అలాగే, 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో పీఠం ఉంటుంది. ఇందులోని ఏనుగులు తొండాల నుంచి నీటిని విరజిమ్ముతూ ఉంటాయి. పద్మపీఠంపై పాదాల నుంచి శిరస్సు వరకు 108 అడుగుల ఎత్తులో రామానుజుల విగ్రహం ఉంటుంది. శిరస్సుపై నుంచి త్రిదండం మరో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ త్రిదండం మొత్తం ఎత్తు 153 అడుగులు.. బరువు 60 టన్నులు. త్రిదండంపైన ఉండే జలపవిత్రం (జెండాలాంటి ఆకృతి) 6 వేల కిలోల బరువు ఉంటుంది.
ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా శ్రీరామానుజుల వారికి ధ్వజస్తంభాన్ని చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. 504 అంగుళాల ధ్వజస్తంభం అది. రామానుజులు అవతరించిన శ్రీపీఠంలోను, వారు పరమపదించిన శ్రీరంగంలోనూ ధ్వజస్తంభాలు లేవు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో మాత్రం 42 అడుగుల ఎత్తులో ధ్వజ స్తంభం ఉంది. నవగ్రహాలు, ద్వాదశ రాశులతో కూడిన రూపాలను ధ్వజస్థంభానికి తొడుగుగా వేశారు.
ముచ్చింతల్‌లో శ్రీరామానుజుల దివ్యక్షేత్ర నిర్మాణాన్ని 2016లో.. 1000 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. సుమారు 2,700 మంది శిల్పులు శ్రమించారు. 18,000 టన్నుల మహా విగ్రహం నిర్మాణంలో విదేశీయులు కూడా పాల్పంచుకున్నారు. సమతామూర్తి విగ్రహం 200 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సమతామూర్తి విగ్రహంతో పాటు రామానుజ జీవిత విశేషాలు తెలియచేసే అత్యాధునిక మ్యూజియం.. మహా విగ్రహం చుట్టూ 108 ఆలయాలు.. అందమైన ఉద్యానవనాలు.. సుమారు 4,600 మంది ఏకకాలంలో చూసేందుకు వీలుగా త్రీ డీ షో.. విగ్రహం ముందు మ్యూజికల్, లైటింగ్ వాటర్ ఫౌంటెయిన్.. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 25 కోట్ల వ్యయంతో వాటర్ ఫౌంటెయిన్‌ను నిర్మించారు. ఇక్కడ మ్యూజికల్ లైటింగ్ కోసం ప్రత్యేకంగా 18 నిమిషాల మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు. లయబద్ధంగా ఫౌంటెయిన్, మ్యూజికల్ లైటింగ్ పని చేస్తుంటాయి. సూర్యాస్తమయం తర్వాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను ఈ మ్యూజిక్‌తో 3డీ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. ఇది మరో తెలంగాణ కేంద్రంగా మరో అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కానుంది.
also read: అంతపెద్ద రామానుజ విగ్రహం ఎలా తయారు చేశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..