నేతలకు ఓకేనా?.. ఉద్యోగులు ఒప్పుకుంటారా?
posted on Feb 5, 2022 10:07AM
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన జనాందోళనగా మారక ముందే జాగ్రత్త పడాలని, భావించిందో లేక భయపడిందో కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చింది. శుక్రవారం అర్థరాత్రి వరకు ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ జరిపిన చర్చల్లో, సర్కార్’ ‘జగ మొండి’ మెట్టు నుంచి ఒకమెట్టు దిగివచ్చింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, పక్షం రోజుల క్రితం అర్థరాత్రి విడుదల చేసిన చీకటి జీఓ’లలో పేర్కొన్నట్లుగా, పదేళ్లకు ఒకసారి కాకుండా ... అయిదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. అదే విధంగా, ఐఆర్ రికవరీ ఉండదని కూడా మంత్రుల కమిటీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, హెచ్ఆర్, సీసీఏ, ఫిట్మెంట్ పెంపుదల, సీపీఎస్ రద్దు వంటి మరి కొన్ని కీలక డిమాండ్ల విషయంలో ఇంకా స్పష్టత రావలసి వుంది.
కాగా, మంత్రుల కమిటీ మరోసారి సంఘాలతో సమావేశమవుతుందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. అలాగే, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్త పరిచారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ఆచితూచి స్పందించారు. ’చర్చించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి, చర్చలు జరుగుతున్నంత వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని’ పీఆర్సీ సాధన సమితి నాయకుడు, బండి శ్రీనివాస రావు చెప్పారు. అంటే, మంత్రుల కమిటీ మీద ఉద్యోగ సంఘాల నాయకులకు సంపూర్ణ విశ్వాసం లేదని ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది. అదే సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులపై ఉద్యోగులకు కూడా సంపూర్ణ విశ్వాసం లేదు. అందుకే,నాయకులూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
మరోవంక, ఒకవేళ ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం, మంత్రుల కమిటీ ఒప్పించి బుట్టలో వేసుకున్నా, ఉద్యోగ సంఘాల నేతలను ఒప్పించినంత తేలిగ్గా, ఉద్యోగులను ఒప్పించడం సాధ్యం కాకపోవచ్చని, ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే, ఉద్యమం నాయకుల చేతుల్లోంచి ఉద్యోగుల చేతుల్లోకి జారిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, పీఆర్సీ సాధన విషయంలో ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఫలమయ్యారనే అభిప్రాయం ఉద్యోగుల్లో వుంది. ఐఆర్ (27శాతం) కంటే ఫిట్మెంట్ (23 శాతం) నాలుగు తగ్గించినా ఉద్యోగ సంఘాల నాయకులు చప్పట్లు కొట్టి, సంతోషం వ్యక్తం చేయడం వల్లనే, ప్రభుత్వం ఆ తర్వాత విడుదల హెచ్ఆర్ శ్లాబుల సవరణ ఇతర ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అలాగే, ఉద్యోగ సంఘాల నాయకులలో కొందరికి ఉద్యోగ సంఘం నేతలకు ప్రభుత్వ ముఖ్యలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపద్యంలో, ఇప్పుడు బంతి ఉద్యోగ సంఘాల నాయకుల కోర్టులో ఉంది. గతంలోలాగా తప్పటడుగు వేస్తే అందుకు నాయకులూ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.
పీఅర్సీ ఫిట్మెంట్ విషయంలోలోలాగా, ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు దీర్ఘకాల ప్రయోజనం చేకూర్చే ప్రాధాన డిమాండ్లను పక్కన పెట్టి, కత్తిరించిన హెచ్‌ఆర్ఏ, అలెవెన్స్‌లు పురుద్దరించడం వంటి చిల్లర డిమాండ్లను ఆమోదిస్తే, అదే మహాభాగ్యం అన్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరిస్తే, సాధారణ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు అంటున్నారు.
నిజానికి ఉద్యోగ సంఘాల నాయకుల చిత్తశుద్ది విషయంలో ఉద్యోగుల్లో మొదటి నుంచి అనుమానాలున్నాయి. నాయకుల అసమర్ధత కారణంగానే ప్రభుత్వం పీఆర్సీ విషయంలో దీర్గః కలం పాటు,దోబూచులాడుతూ, మోసం చేస్తూ వచ్చిందని ఉద్యోగులు ముందునుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. అలాగే, చివరకు ఉద్యోగుల ఒత్తిడితో నాయకులు ఉద్యమంలోకి వచ్చారు తప్పించి ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన వారికి లేదనే అనుమానాలున్నాయి. అలాగే,చలో విజయవాడకు ఉద్యోగ సంఘం నేతలు పిలుపు మాత్రమే ఇచ్చారు. సక్సెస్ చేసింది మాత్రం ఉద్యోగులే.. నిజానికి ఈ స్థాయిలో ఉద్యోగులు వస్తారని నాయకులు కూడా ఉహించలేదు. ఆందోళన సక్సెస్ చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయినా ఉద్యోగులు ఉద్యమం బాధ్యతను తమ మీద వేసుకుని వచ్చారు ..చలో విజయవాడ సక్సెస్ అయింది. అంటే, ఇప్పుడు ఉద్యమం నాయకుల చేతుల్లో లేదు, ఉద్యోగుల చేతుల్లో వుంది. ఈ నేపద్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏమి చేస్తారు .. ఏమి సాధిస్తారు .. సామాన్య ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు ఉంటాయా .. ఇవ్వన్నీఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుల ముందున్న ప్రశ్నలు.