శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే జగన్ జైలు యాత్రలు : సోమిరెడ్డి
posted on Jul 2, 2025 8:02PM

శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. పిచ్చి వేషాలు వేద్దామనుకుంటే..పోలీసులు తాట తీస్తారు..జాగ్రత్త అని సోమిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా దుర్మార్గాలు, పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎల్లుండి రఫ్ఫా రఫ్పా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంటని ఆయన దుయ్యబట్టారు. రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడని ఆయన అన్నారు.
మూడు కార్లు, 100 మంది జనానికి అనుమతి తీసుకుని 9 గంటల పాటు 80 కిలోమీటర్లు ర్యాలీ చేశాడని సోమిరెడ్డి వెల్లడించారు. 680 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించినా మూడు ప్రాణాలను తీసుకున్నాడని తెలిపారు. జగన్ రెడ్డి కారు కింద సింగయ్య ప్రాణం నలిగిపోతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లాలనే మానవత్వం కూడా చూపలేదని చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నాని తెలిపారు. జైలు వద్దకు వెళ్లి గోవర్ధన్ రెడ్డి అందాలను పొగుడుకుని వెళితే మాకెలాంటి అభ్యంతరం లేదు..చీమకు నష్టం జరిగినా ఊరుకోబోమని ఆయన గుర్తుంచుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు అతిగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు