దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎస్ఐఆర్

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం.. తాజాగా ఈ విషయంపై రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో బుధవారం (సెప్టెంబర్ 10) కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల సంఘాల ప్రధాన అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భేటీ అయ్యారు. బీహార్ లో ఇటీవల ఈ సర్వే చేపట్టి ఓటర్ జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే, ఈసీ చర్య రాజ్యాంగబద్ధమేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో  సమావేశంలో కేందర ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారులు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీహార్‌ లో ఈ విధానాన్ని అమలు చేసిన తీరును ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వివరించారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu