దసరా రోజున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు : సీఎం చంద్రబాబు

 

 

పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తామని సీఎం తెలిపారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలని సీఎం తెలిపారు. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. 

2023, మే నెల 28న రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని సూపర్ సిక్స్ హామీలతో పాటు ఉమ్మడిగా కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి  ప్రజా తీర్పు కోరామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనీ వినీ ఎరుగని రీతిలో 57 శాతం ఓట్ షేర్, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టివేసిందని చంద్రబాబు అన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాగతాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారని ఆయన పేర్కొన్నారు. 

 

ప్రతి పేద బిడ్డా చదవాలని తల్లికి వందనం’ తీసుకువచ్చామని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా, పరిమితులు లేకుండా అందరికీ రూ. 15 వేలు చొప్పున అందించాం. 67 లక్షల మంది విద్యార్ధుల చదువులకు ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 

 

 

ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్‌ హిట్‌ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేశాం’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో కార్యకర్తలు భారీగా తరలించ్చారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ సభా ప్రాంగణానికి రాగానే.. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వారికి చంద్రబాబు, పవన్‌, మాధవ్‌ అభివాదం చేశారు. దీంతో వారంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu