ఇది తాగితే నిద్ర పట్టేస్తుంది!

 

ఒత్తిడి. ఈ మాట గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదు. ఇది మన జీవితాలలో ఉన్నదే! మారుతున్న జీవనశైలి పుణ్యమా అని అటు ఉద్యోగంలోనూ, ఇటు ఇంట్లోనూ కావల్సినంత ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడితో నిద్ర పట్టని మాటా నిజమే! అలాంటి నిద్రలేమి వల్ల డిప్రెషన్‌, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి సమస్యలు సరేసరి. పోనీ నిద్రమాత్రలు వేసుకుందామా అంటే... వాటికి ఉండే దుష్ప్రభావాలూ తక్కువేం కాదు. వెరసి ఇటు నిద్రా పట్టక, అటు ఆరోగ్యమూ చెడిపోయే పరిస్థితి. కానీ ఇందుకో చిట్కా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

 

జపానుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు.. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమిని దూరం చేసే పదార్థాల మీద ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం Octacosanol అనే రసాయనం ఏమేరకు ఉపయోగపడుతుందో చూశారు. ఈ Octacosanolను ఎలుకల మీద ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ రసాయనం ఎలుకలలోకి చేరగానే వాటిలోని ఒత్తిడి చాలావరకు తగ్గిపోయినట్లు తేలింది. మన రక్తంలోని ఒత్తిడని సూచించే corticosterone అనే పదార్థం చాలా అదుపులో కనిపించింది. Corticosterone అదుపులోకి రాగానే గాఢనిద్ర పడుతున్నట్లు తేలింది.

 

ఒకే ఒక్క రసాయనంతో మనలోని ఒత్తిడి తగ్గిపోతుందనీ, మంచి నిద్ర పడుతుందనీ తేలిపోయింది. కానీ దీన్ని వాడేదెలా! Octacosanol ఇప్పటికే మందుల రూపంలో దొరుకుతోంది. కొవ్వుని తగ్గించడానికీ, బలాన్ని పెంచడానికీ ఈ మందును వాడుతూ ఉంటారు. గోధుమలు, బియ్యపు పొట్టు నుంచి ఈ పొడిని తయారుచేస్తుంటారు.

 

మందుగా కాకుండా మనకి కనిపించే ఓ ఆహారపదార్థంలో కూడా ఈ Octacosanol పుష్కలంగా లభిస్తుందని చెబుతారు. అదే చెరుకురసం! తెల్లటి చెరుకుగడల నుంచి తీసిన రసంలో ఈ రసాయనం తగినంత మోతాదులో ఉంటుందట. కాబట్టి ఎప్పుడన్నా ఒత్తిడితో నిద్ర పట్టకపోతుంటే ఓ గ్లాసుడు చెరుకురసం తీసుకుంటే తప్పకుండా ఫలితం దక్కుతుందని సూచిస్తున్నారు.

- నిర్జర.