మేడారంలో సీతక్క ఆపరేషన్ షురూ
posted on Feb 8, 2022 4:01PM
సామాజిక అవగాహనలో అందరికన్నా ప్రత్యేకతను, సామాజిక బాధ్యత పట్ల మరింత శ్రద్ధను కనబరిచే ములుగు ఎమ్మెల్యే సీతక్క మరో అవతారం ఎత్తారు. తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మేడారం జాతర ఫలితంగా తలెత్తే పరిణామాలపై ఎంతో బాధ్యతాయుతంగా రెస్పాండ్ అయ్యారు.
అమ్మవారి మీద భక్తితో వచ్చే సమ్మక్క-సారక్క భక్తుల దృష్టి అంతా మొక్కుల మీదనే ఉంటుంది తప్ప... తాము మొక్కులు తీర్చుకున్న తరువాత అక్కడ తలెత్తే పరిస్థితులపై ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తాను ఎమ్మెల్యే కాక ముందు తనకున్న సామాజిక అవగాహనతో ప్రజలు ఎరుగని బాధ్యతలను కూడా ఆమె ఎంతో వినమ్రతతో గుర్తు చేస్తుండడం విశేషం.
విషయంలోకి వెళ్తే.. మేడారం జాతర 16 నుంచి 19 వరకు జరుగుతుంది. అయితే జాతరకు ఓ 20 రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇప్పటికి మరో వారం రోజులు అసలు జాతర ఉండగానే మేడారం పరిసరాలన్నీ దుర్గంధంతో కంపు కొడుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జాతర తరువాత మేడారం పరిసర గ్రామాల ప్రజలు అక్కడ ఉండలేని దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. భక్తులు జాతరలో భాగంగా కోళ్లు, మేకలు అమ్మవార్లకు బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో జంతు కళేబరాలు, వాటి వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడే ప్రత్యక్షమవుతూ అక్కడి వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. ఒక్కరోజు కోసం వచ్చే భక్తులంతా అక్కడి స్థలాన్ని వాడుకోవడమే తప్ప అక్కడ మెయిన్ టెయిన్ చేయాల్సిన పారిశుద్ధ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడుండే ప్రజల గురించి ఆలోచించడం లేదు.

ఇదే విషయాన్ని ఎమ్మెల్యే సీతక్క ఎంతో వినమ్రతతో భక్తులకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వేస్టేజ్ కోసం ఉద్దేశించిన డబ్బాల్లోనే వ్యర్థాలన్నీ వేయాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని చేతులెత్తి మొక్కుతున్నారు. మరోవైపు... ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది కేవలం అమ్మవార్ల గద్దెల దగ్గర పరిసరాల మీదనే దృష్టి సారించారు తప్ప... చుట్టుపక్కల పరిశుభ్రతను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. ఏమంటే... తమ విధులు అక్కడివరకేనని, అంతకుమించి తమ డ్యూటీ కాదని నిర్ద్వంద్వంగా చెప్పేస్తున్నారు. దీంతో సీతక్కే స్వయంగా రంగంలోకి దిగి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించారంటున్నారు ఈ విషయాన్ని చూసిన ప్రజలు.
ప్రతిసారీ మేడారం జాతర ముగిశాక అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో కలరా వ్యాపిస్తుంది. ఇంతకుముందు దీన్ని గత్తర అనేవారు. అయితే ప్రభుత్వాలు కాస్త శ్రద్ధ కనబరుస్తున్న క్రమంలో గత్తర కాలం పోయింది కానీ... ఆధునికత పేరు చెప్పి జల్సాలకు వచ్చే టూరిస్టులు, జాతర ప్రచారం కారణంగా అంతకంతకూ పెరుగుతున్న యాత్రికుల కారణంగా కలరా, మలేరియా వంటివి తలెత్తుతున్నాయి. క్రితంసారి కూడా అలాగే జరిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న సీతక్క... ఈసారి ముందే మేల్కొని.. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, పారిశుధ్య సిబ్బంది చేయలేని పనిని స్వయంగా చేసి పెడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.